నల్లగొండ : తాళం వేసి ఉన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ప్రధాన నిందితుడిని నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేయగా.. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్ వెల్లడించారు.
సీసీ ఫుటేజీ ఆధారంతో చిక్కిన దొంగ
జూలై 26న నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీలో గల ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటనపై నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి ఈనెల 6న పానగల్ బైపాస్ వద్ద ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీమ్‌ను అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి నుంచి రూ.3.25 లక్షల నగదు, స్కూటీ, రెండు ఇనుప రాడ్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇర్షాద్, షరీఫ్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
రెక్కీ నిర్వహించి పగటి పూట దోపిడీ
ఈ ముఠా ముందుగా తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహించేవారు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక, పగటి సమయంలోనే ఇనుప రాడ్లతో తాళాలు పగులగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లేవారు. నల్లగొండలో నసీమ్, ఇర్షాద్ స్కూటీపై రాగా, షరీఫ్ కారులో వచ్చి బయట కాపలాగా ఉండేవాడని విచారణలో తేలింది. నల్లగొండతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వేదాయపాలెం, తిరుపతిలోని తిరుచానూరు ప్రాంతాల్లోనూ వీరు చోరీలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు.
పోలీసు బృందానికి అభినందనలు
డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో కేసును వేగంగా ఛేదించిన వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐలు సైదబాబు, ముత్తయ్య, సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.
పాత నేరస్థుడే ప్రధాన సూత్రధారి
ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీమ్‌కు నేర చరిత్ర ఉంది. గతంలో ఢిల్లీ, మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతాల్లో అనేక చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం హైదరాబాద్‌లోని రాయదుర్గం, ఉప్పల్, మల్కాజిగిరి ప్రాంతాల్లోనూ చోరీలకు పాల్పడి చర్లపల్లి జైలులో రెండేళ్లు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో నివాసం ఉంటూ తిరిగి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫ రూ.3.25 లక్షల నగదు,
స్కూటీ స్వాధీనం
ఫ పరారీలో మరో ఇద్దరు నిందితులు
ఫ వివరాలు వెల్లడించిన అడిషనల్
ఎస్పీ రమేష్


