భువనగిరిలో ఏటీఎం చోరీకి విఫలయత్నం | - | Sakshi
Sakshi News home page

భువనగిరిలో ఏటీఎం చోరీకి విఫలయత్నం

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

భువనగిరిటౌన్‌ : భువనగిరి పట్టణంలోని గంజ్‌ ఏరియాలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో శుక్రవారం వేకువజామున ఓ దుండగుడు చోరీకి విఫలయత్నం చేశాడు. ద్విచక్ర వాహనంపై వచ్చిన నిందితుడు ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించేందుకు యత్నించాడు. రోజువారీ పెట్రోలింగ్‌ విధుల్లో భాగంగా వస్తున్న పోలీసులను గమనించి దుండగుడు బైక్‌పై పరారయ్యారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ తెలిపారు.

మహిళపై కోతుల దాడి

మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో టి.మానస అనే మహిళపై శుక్రవారం కోతులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా గురువారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై కూడా కోతులు దాడి చేశాయని, పంట పొలాల్లోనూ నష్టం కలిగిస్తున్నాయని వాపోయారు. కోతుల బెడదను నివారించాలని కోరుతున్నారు.

విద్యుదాఘాతంతో

వ్యక్తి మృతి

భువనగిరి: విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకుల మహేష్‌(40) శుక్రవారం ఇంటి వద్ద నీటి సంపు మోటార్‌ను ఆన్‌చేసే క్రమంలో విద్యుత్‌ షాక్‌ రావడంతో కిందపడిపోయాడు. ఆయన భార్య మాధవి గ్రామంలో ఉన్న కిరాణం దుకాణాకి వెళ్లి ఇంటికి వచ్చే సరికి భర్త కిందపడి ఉండడాన్ని గమనించి చికిత్స నిమిత్తం భువనగిరిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్‌ తెలిపారు.

అదుపుతప్పి బొలేరో వాహనం బోల్తా

చిట్యాల: హైదరాబాద్‌ నుంచి ఏలూరులోని జంగారెడ్డిగూడేనికి ప్లాస్టిక్‌ కుర్చీల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం శుక్రవారం చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని పంజాబీ దాబా సమీపంలోకి రాగానే స్టీరింగ్‌ రాడ్‌ పిన్‌ ఊడిపోవటంతో అదుపుతప్పింది. దీంతో డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. రోడ్డుపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బొలేరో వాహనాన్ని క్రేన్‌ సాయంతో పక్కకు తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement