ఆకుపాములలో విషాదఛాయలు | - | Sakshi
Sakshi News home page

ఆకుపాములలో విషాదఛాయలు

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

మునగాల: ముకుందాపురం గ్రామ స్టేజీ శివారులో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. సకాలంలో 108 అంబులెన్స్‌ రాకపోవడంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మునగాల మండలంలోని ఆకుపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గౌరారపు ఎలమంద (65), ఆయన పెద్ద కుమారుడు గౌరారపు లింగయ్య (45)తో కలిసి ద్విచక్ర వాహనంపై నడిగూడేనికి వెళ్లి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ముకుందాపురం గ్రామ స్టేజ్‌ శివారు వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 వాహనానికి ఫోన్‌ చేయగా, మునగాల మండల వాహనం అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. చివరికి కోదాడ నుంచి వేరే వాహనం వచ్చేసరికే లింగయ్య మృతిచెందాడు. తండ్రి ఎలమందను అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటనపై మృతుడు లింగయ్య సోదరుడు గౌరవరపు కోటేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇరువురి మృతదేహాలకు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులు అప్పగించామని ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.

అంత్యక్రియలు పూర్తి

ఎలమంద (65) వృత్తిరీత్యా వ్యవసాయ కూలీ. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె, ఉన్నారు. ఎలమంద పెద్ద కుమారుడు లింగయ్య(45) వృత్తిరీత్యా లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య , కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆకుపాములలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. వారి అంత్యక్రియలు శుక్రవారం గ్రామంలో నిర్వహించారు.

ఫ రోడ్డుప్రమాదంలో

తండ్రీకుమారుడికి తీవ్ర గాయాలు

ఫ అక్కడికక్కడే కుమారుడు మృతి

ఫ ఆస్పత్రికి తరలిస్తుండగా

తండ్రి దుర్మరణం

ఫ సుమారు గంటన్నర పాటు ఘటనా స్థలానికి చేరుకోని 108వాహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement