చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని శివాజీనగర్ కాలనీకి చెందిన చేనేత కళాకారుడు రెబ్బ యాదగిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆరు నెలల పాటు శ్రమించి ప్రకృతి సహజ సిద్ధమైన రంగులతో మామిడి కొమ్మలు, పూర్ణకుంభం, కలశం డిజైన్‌లో పోచంపల్లి ఇక్కత్ చీరను రూపొందించారు. 30 ఏళ్ల నుంచి చేనేత వృత్తిలో ఉన్న ఆయన విభిన్నమైన రంగులు, డిజైన్లతో కూడిన ముడి సరుకులు తయారు చేయించి పది మగ్గాల ద్వారా సొంతంగా చీరలను నేయిస్తూ తనతో పాటు మరో ఇరవై మందికి ఉపాధి కల్పిస్తున్నారు. జాతీయ స్థాయి పురస్కారానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎంపిక కాలేదు. వచ్చే ఏడాది ఎలాగైనా జాతీయ స్థాయి పురస్కారాన్ని కై వసం చేసుకోవడమే లక్ష్యంగా చీరను తయారు చేస్తున్నానని యాదగిరి తెలిపారు. తనకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


