భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లికి చెందిన సీత సుధాకర్ ఎంబీఏ చదివి చేనేత వృత్తి రాణిస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా మడ్తాస్ ఇక్కత్ చీరను రూపొందించి ఉత్తమ డిజైనర్‌గా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. 3 ప్లే వార్పు, 7 ప్లే వెప్ట్ మల్చరీ సిల్క్ దారం, 240 కొయ్యలు, వైట్ బేస్‌లో చీరలో జీవరాసులను సృష్టించారు. చీరపై నెమలి, ఏనుగు, జింక, హంస, కుందేలు, కింగ్‌ఫిషర్, కొంగ, రామచిలుక, బాతు, సీతాకోకచిలుకలతో పాటు కొంగు(పల్లు)లో ఏనుగు, ఆవు, నెమలి, హంస, సింహం, జింకను రూపొందించారు. తాను చీరపై సృష్టించాలనుకొన్న జీవరాసులను ముందుగా గ్రాఫ్‌పై గీసి అందుకనుగుణంగా మూడు ఆసులపై చిటికి కట్టి, జంతువులు, పక్షులు స్పష్టంగా కన్పించేలా ఎరుపు, ఆనంద, గుమ్మడి, ఆకుపచ్చ రంగులద్దారు.చీర తయారీ కోసం మూడు నెలల పాటు శ్రమించినట్లు ఆయన తెలిపారు. ప్రకృతిని కాపాడితే జీవరాసులు తమ మనుగడను కొనసాగిస్తాయనే ఇతివృత్తంతో జీవ వైవిధ్యాన్ని కాపాడాలని చీరను రూపొందించినట్లు సీత సుధాకర్ తెలిపారు. తన నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


