టీఎంయూను గెలిపించండి | - | Sakshi
Sakshi News home page

టీఎంయూను గెలిపించండి

Aug 5 2026 9:39 AM | Updated on Aug 5 2026 9:39 AM

రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, బకాయిపడ్డ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో తమ యూనియన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన నల్లగొండ రీజియన్‌ సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆరేళ్లు గడుస్తున్నా కార్మికుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ నీతి నిజాయితీ గల తమ సంఘంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. యాజమాన్యం కార్మికుల శ్రమను దారుణంగా దోచుకుంటోందని, కొన్ని డిపోల్లో మహిళా ఉద్యోగులు రాత్రివేళల్లో డ్యూటీలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సమ్మె సమయంలో జేఏసీ నాయకులు 10 శాతం ఫిట్‌మెంట్‌కు ఒప్పుకోగా, తాము మాత్రం దాన్ని వ్యతిరేకించడంతో 11 శాతానికి పెంచిందన్నారు. రాబోయే ఆర్టీసీ ఎన్నికల్లో సీఐటీయూ మద్దతు తమకే ఉందన్నారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ మాట్లాడుతూ.. కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే ఏకై క నాయకుడు అశ్వత్థామరెడ్డి అని కొనియాడారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ ఆలస్యం కావడానికి ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులే ప్రధాన కారణమని విమర్శించారు. తమ సంఘం సుదీర్ఘంగా చేసిన పోరాటాల ఫలితంగానే ఉద్యోగులకు 44 శాతం జీతాలు పెరిగాయని, అలాగే 17 వేల మంది ఉద్యోగుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ అయ్యాయని స్పష్టం చేశారు. కార్మికుల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి తమ ప్యానెల్‌కు అత్యధిక మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నిరంజన్‌, నాగశేషు, యాదయ్య, శ్రీదేవి, మీలా ప్రభాకర్‌, శ్రీనివాస్‌, రీజియన్‌ సెక్రెటరీ గోపనబోయిన శ్రీనివాస్‌, అధ్యక్షుడు తయబ్‌, అన్ని డిపోల సెక్రటరీలు, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

యూనియన్‌ వ్యవస్థాపక

ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి

నల్లగొండలో ఆర్టీసీ రీజియన్‌

సర్వసభ్య సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement