చౌటుప్పల్ : మునుగోడు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులపై వారం రోజుల్లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌లో మునుగోడు నియోజకవర్గంలోని ప్రభుత్వాస్పత్రులు, వాటి అభివృద్ధిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కలిసి మంత్రి సమీక్షించారు. సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను ఎలా అభివృద్ధి చేయాలన్న అంశాలను ఎమ్మెల్యే రాజ గోపాల్‌రెడ్డి వివరించారు. చౌటుప్పల్‌లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, మునుగోడు, నాంపల్లి ఆస్పత్రులను 30పడకలకు, మర్రిగూడ ఆస్పత్రిని 50పడకలకు, చండూరులో 100పడకలకు పెంచాలని, గట్టుప్పల్ ఆస్పత్రికి సిబ్బందిని మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఆస్పత్రుల బడ్జెట్ పెంచాలని విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చౌటుప్పల్‌లో ప్రస్తుతం నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రి పనులను త్వరితగతిన పూర్తి చేసి సెప్టెంబర్ మాసంలో ప్రారంభించుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్‌తోపాటు ట్రామాకేర్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్‌నాయక్, నల్లగొండ, యాదాద్రి జిల్లాల వైద్యాధికారులు డాక్టర్ రాహుల్, మనోహర్, డీసీహెచ్‌లు సూర్యశ్రీ, మాతృనాయక్ పాల్గొన్నారు.
ఫ చౌటుప్పల్‌లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
ఫ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
దామోదర రాజనర్సింహ
ఫ మునుగోడు నియోజకవర్గంలోని
ఆస్పత్రులపై ఎమ్మెల్యే
రాజగోపాల్‌రెడ్డితో కలిసి సమీక్ష


