ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..! | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..!

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

మిర్యాలగూడ అర్బన్‌ : మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డుపై మృత్యుఘంటికలు మోగుతున్నాయి. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి గుండా వెళ్లే భారీ వాహనాలు మిర్యాలగూడ పట్టణంలోకి రాకుండా 2001లో పట్టణ శివారు నుంచి బైపాస్‌ నిర్మించారు. నిబంధనల ప్రకారం బైపాస్‌ నిర్మాణ సమయంలోనే సర్వీస్‌ రోడ్డు వేయాల్సి ఉన్నప్పటికీ, అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా సమీప గ్రామాల ప్రజలు, వాహనదారులు బైపాస్‌ రోడ్డు గుండానే ప్రయాణాలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

మృత్యు నిలయాలుగా బ్లాక్‌ స్పాట్లు

ఒకప్పుడు మిర్యాలగూడ పట్టణ శివారులో ఉన్నట్లుగా కనిపించిన బైపాస్‌ రోడ్డు.. ఇప్పుడు వ్యాపార పరంగా పట్టణం విస్తరించడంతో టౌన్‌ మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఈ బైపాస్‌పై నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రామచంద్రగూడెం, నందిపాడు రోడ్డు, చిల్లాపురం రోడ్డు, చింతపల్లి రోడ్డు, ఈదులగూడ ప్రాంతాలను పోలీసులు బ్లాక్‌ స్పాట్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు రక్షణ చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఫ్లైఓవర్ల నిర్మాణంతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని భావించి నాలుగు చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని నిర్ణయించినప్పటికీ, ఆ ప్రతిపాదనలు ఆచరణకు నోచుకోవడం లేదు.

90 మందికి పైగా క్షతగాత్రులు

గడిచిన 19 నెలల కాలంలోనే ఈ ఐదు బ్లాక్‌ స్పాట్లలో సుమారు 70కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయా ప్రమాదాల్లో 24 మందికి పైగా మృత్యువాత పడగా, 90 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

కొన్ని ఘోర ప్రమాదాలు

● ఆదివారం ఉదయం స్కూటీపై వెళ్తున్న దంపతులు చిల్లాపురం క్రాస్‌ రోడ్డు వద్ద బైపాస్‌ను దాటుతుండగా.. కంటైనర్‌ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతిచెందగా, భర్త స్వల్ప గాయాలయ్యాయి.

● గత నెల 21న నందిపాడు వద్ద స్కూటీపై వెళ్తున్న వ్యక్తి బైపాస్‌ దాటుతుండగా గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కంటైనర్‌ ఢీకొట్టింది. అంతేకాకుండా ఆటోను, రోడ్డు పక్కన ఉన్న రెండు డీసీఎం వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తి మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

● ఇటీవల నందిపాడు వద్ద ద్విచక్ర వాహనంపై బైపాస్‌ దాటుతున్న దంపతులను కంటైనర్‌ ఢీకొనడంతో భార్య మృతిచెందగా, భర్త తీవ్రగాయాలతో జీవచ్ఛవంలా మారాడు.

● ఇటీవల చింతపల్లి వద్ద ట్రావెల్స్‌ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న మహిళ మృతిచెందింది. బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

● గతేడాది ఈదులగూడ చౌరస్తాలో గ్రానైట్‌ లోడుతో వెళ్తున్న వాహనాన్ని ట్యాంకర్‌ ఢీకొట్టడంతో గ్రానైట్‌ బండల మధ్య నలిగిపోయి ముగ్గురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు.

ధర్నా చేస్తున్న మిర్యాలగూడ బైపాస్‌ సమీప గ్రామాల ప్రజలు

ఫ నార్కట్‌పల్లి–అద్దంకి బైపాస్‌పై

మిర్యాలగూడ పట్టణంలో ఐదు బ్లాక్‌స్పాట్లు

ఫ 19 నెలల్లో 70కి పైగా ప్రమాదాలు

ఫ 24 మందికి పైగా మృతి

ఫ ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరుతున్నా

పట్టించుకోని పాలకులు

నల్లగొండ : నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై మిర్యాలగూడ బైపాస్‌ వద్ద అండర్‌పాస్‌, ఫ్లైఓవర్‌ నిర్మించాలని సోమవారం నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట బైపాస్‌ రోడ్డు సమీప గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement