అమ్మపాలే అమృతం | - | Sakshi
Sakshi News home page

అమ్మపాలే అమృతం

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం

తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతల ఇళ్లకు అంగన్‌వాడీ టీచర్‌, ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి తల్లిపాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక సదస్సులు నిర్వహించి గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తిస్థాయిలో వివరిస్తున్నాం.

– కృష్ణవేణి, మహిళా, శిశు, దివ్యాంగుల

సంక్షేమ శాఖ అధికారి, నల్లగొండ

ఆలేరు రూరల్‌, మిర్యాలగూడ టౌన్‌, భానుపురి: చిన్న పిల్లలకు తల్లిపాలు అమృతంతో సమానం. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించాలంటే తల్లిపాలను పట్టించాల్సిందే. మారుతున్న జీవనశైలి, పాశ్చాత్య పోకడలు, అవగాహన లేమి కారణంగా బిడ్డకు అమృతతుల్యమైన తల్లిపాలు దూరమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో తల్లిపాలపై ఉన్న అపోహలు తొలగించి, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతను తెలియజేసేందుకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు తల్లిపాలపై బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు.

శిశువులకు కలిగే ప్రయోజనాలు

పుట్టిన గంట నుంచి మూడు రోజుల పాటు లభించే ముర్రుపాలతో పాటు, ఆరు నెలల పాటు కేవలం తల్లి పాలు మాత్రమే తాగిన పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగి ఎంతో చురుగ్గా ఉంటారు. ప్రతిరోజు ఎనిమిది నుంచి పది సార్లు తల్లిపాలను శిశువులకు పట్టించవచ్చు. తల్లిపాలు చిన్నారులకు తేలికగా ఆరగడంతో పాటు డయేరియా, శ్వాసకోశ వ్యాధులు, పచ్చకామెర్లు, ఇతర అంటువ్యాధుల నుంచి శిశువును కాపాడతాయి. వీటిలో విటమిన్‌–ఏ, విటమిన్‌–కే పుష్కలంగా ఉంటాయి.

పోషక విలువలు

ప్రతి వంద మిల్లీలీటర్ల తల్లిపాలలో ప్రోటీన్లు 1.1 గ్రాములు. కొవ్వు 4.2 గ్రాములు, లాక్టోస్‌ 7 గ్రాములు ఉంటాయి. వీటితో పాటు సోడియం, క్యాల్షియం, ఫాస్పరస్‌, కార్బోహైడ్రేట్లు తగిన మోతాదులో ఉంటాయి.

తల్లులకు కలిగే ప్రయోజనాలు

బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో కాన్పు అనంతరం గర్భాశయం వేగంగా సాధారణ స్థితికి రావడంతో పాటు రక్తస్రావం తగ్గుతుంది. అండాశయం, రొమ్ము సంబంధిత క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి స్థూలకాయం రాకుండా ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలో బాలింతలు, గర్భిణుల వివరాలు ఇవీ..

నల్లగొండ భువనగిరి సూర్యాపేట

ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు 09 04 05

అంగన్‌వాడీ కేంద్రాలు 2,093 901 1,209

6 నెలల నుంచి

6 ఏళ్ల పిల్లలు 72,474 46,679 28,479

గర్భిణులు 8,538 4,994 7,200

బాలింతలు 6,593 3,232 5,595

7 వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు

గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్‌ సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement