గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్‌

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

కోదాడ రూరల్‌ : ఒరిస్సా నుంచి గంజాయి, ఖమ్మం నుంచి మత్తు కల్గించే దగ్గు సిరప్‌లను(టాస్సెక్స్‌) తీసుకొచ్చి కోదాడ పరిసరాల్లో విక్రయిస్తున్న ముఠాను పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి కోర్టులో రిమాండ్‌ చేశారు. ఈ కేసు వివరాలను సోమవారం సీఐ కె. శివశంకర్‌తో కలిసి కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం అల్వాలపురానికి చెందిన మద్దే రవితేజ ఒరిస్సాలోని మల్కన్‌గిరి ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, కోదాడకు తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని డేగబాబు ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోని చెట్ల వద్ద గంజాయి విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో సీఐ శివశంకర్‌ నేతృత్వంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మద్దే రవితేజతో పాటు కోదాడ పట్టణంలోని గణేష్‌నగర్‌కు చెందిన అవిడి రాఘవ, గాంధీనగర్‌కు చెందిన పంది వినోద్‌, చిన్నమసీదు బజారుకు చెందిన షేక్‌ మగ్దూమ్‌, తమ్మరబండపాలేనికి చెందిన షేక్‌ ఇర్షాద్‌తో పాటు మరో ముగ్గురు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకున్నారు. నట్టే అనుదీప్‌ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి 6 కేజీల గంజాయి, బైక్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం నుంచి మత్తు సిరప్‌లు..

అంతేకాకుండా వారి నుంచి 38 మత్తు కలిగించే దగ్గు సిరప్‌(టాస్సెక్స్‌) బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిరప్‌లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారని ప్రశ్నించగా.. ఖమ్మంలోని వైరా రోడ్‌లో గల ఏఐ మెడినోవా మెడికల్‌ స్టోర్‌లో పనిచేసే షేక్‌ సుభాని వద్ద నుంచి ఎలాంటి డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా రూ.279.69 ఉన్న టాస్సెక్స్‌ సిరప్‌లను రూ.350కు కొనుగోలు చేసి కోదాడలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు వారు అంగీకరించారు. దీంతో మెడికల్‌ షాపులో పనిచేసే షేక్‌ సుభానీని కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర నిందితుల ప్రమేయంపై మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ అజయ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

తొమ్మిది మంది రిమాండ్‌.. ఒకరు పరారీ

అరెస్టయిన వారిలో ముగ్గురు మైనర్లు

6 కేజీల గంజాయి, 38 దగ్గు సిరప్‌ బాటిళ్లు, బైక్‌, ఫోన్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన

కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement