గరిడేపల్లి : విద్యుదాఘాతానికి గురై వికలాంగుడైన ప్రైవేట్ విద్యుత్ కార్మికుడికి న్యాయం చేయాలని అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గరిడేపల్లి సబ్‌స్టేషన్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో ఇటీవల విద్యుత్ లైన్ మరమ్మతులు చేపట్టిన ట్టారు. ఆ పనులు చేపట్టిన విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న నేరేడుచర్ల మండలంకు దిర్శించర్ల పంగా సురేష్ విద్యుత్ స్తంభం పైకి పనిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై గురై కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, అతడి చేయి, కాలును తొలగించాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో సర్జరీ చేసి చేయి, కాలు తొలగించారు. అయితే ఈ ఘటనకు లైన్‌మెన్ కారింగుల అంజయ్య, విద్యుత్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, ఎల్‌సీ తీసుకోకుండానే సురేష్‌ను విద్యుత్ స్తంభం ఎక్కించారని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం గరిడేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ తన సిబ్బందితో సబ్ స్టేషన్ వద్దకు చేరుకొని వారితో చర్చించి ఆందోళన విరమింపజేశారు.


