ఆలేరురూరల్: ఆలేరును త్వరలో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. శనివారం ఆలేరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. రెవెన్యూ డివిజన్ అంశంపై అఖిలపక్షాలు కలిసి ధర్నా నిర్వహించడం ప్రజాస్వామ్యంలో వారి హక్కేనని పేర్కొన్నారు. 2016లో జిల్లాల పునరుద్ధరణ చేస్తున్న క్రమంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 25 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తే మరి ఆలేరును ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో ఆలేరు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు.గత ప్రభుత్వం పదేళ్లలో ఆలేరు ప్రాంతానికి రూ.10 కోట్లు నిధులు తెస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.70 కోట్లు తెచ్చిందని గుర్తు చేశారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ మాజీ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ బీజనీ బాలమణిభాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఐనాల చైతన్య, కౌన్సిలర్ ఎం.ఏ ఎజాజ్ పాల్గొన్నారు.


