చేతికందని చేయూత! | - | Sakshi
Sakshi News home page

చేతికందని చేయూత!

Jul 31 2026 1:27 AM | Updated on Jul 31 2026 1:27 AM

నెలాఖరొచ్చినా పింఛన్‌ రాలే.. నగదు కొరతతో పంపిణీలో జాప్యం

ఫ తెరుచుకోని పోస్టాఫీసులు ఫ చౌటుప్పల్‌, నారాయణపురంలో నిల్‌ ఫ జిల్లా వ్యాప్తంగా ఇంకా రూ. 10 కోట్ల బకాయిలు

సాక్షి, యాదాద్రి: చేయూత పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.బ్యాంకుల్లో అవసరమైనంత నగదు అందుబాటులో లేకపోవడంతో నెలాఖరు గడుస్తున్నా పింఛన్లు పూర్తిస్థాయిలో అందలేదు. బ్యాంకుల నుంచి పోస్టాఫీసులకు సమయానికి సొమ్ము చేరకపోవడమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమవుతోంది. గురువారం సాయంత్రం వరకు పలు మండలాల్లో ఒక్కరికి కూడా పింఛన్‌ అందకపోగా, మరికొన్ని చోట్ల నగదు లేదనే సాకుతో పోస్టాఫీసుల గేట్ల తాళాలు తీయకపోవడం గమనార్హం.

చౌటుప్పల్‌, నారాయణపురంలో పంపిణీ సున్నా

నెలాఖరొచ్చినా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ, చౌటుప్పల్‌ మండలం, నారాయణపురం మండలాల్లో గురువారం సాయంత్రం వరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా పింఛన్‌ సొమ్ము పంపిణీ కాలేదు. నల్లగొండ జిల్లా నుంచి రావాల్సిన నగదు నిల్వలు సర్దుబాటు కాకపోవడమే ఇందుకు కారణం. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్‌ గ్రామీణ ప్రాంతంలో 5,184 మంది లబ్ధిదారులకు రూ.1,31,86,432, చౌటుప్పల్‌ టౌన్‌లో 2,643 మందికి రూ.66,91,120, నారాయణపురం మండలంలో 5,822 మందికి రూ.1,49,87,296 మేర పింఛన్లను ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇక భువనగిరి బీచ్‌ మహల్లా పోస్టాఫీస్‌ పరిధిలోని 1,200 మంది పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. కొలనుపాకలోని 1,200 మంది పింఛన్‌దారుల్లో కేవలం 300 మందికే నగదు అందగా, మిగిలిన వారికి సర్దుబాటయ్యాక ఇస్తామని అధికారులు చెబుతున్నారు. భువనగిరి ప్రధాన పోస్టాఫీసులో ఇతర ఖాతాదారులు డిపాజిట్‌ చేస్తున్న నగదుతో రోజుకు రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల చొప్పున మాత్రమే సర్దుబాటు చేస్తున్నారు.

రూ.10 కోట్లకు పైగా బకాయిలు

జిల్లా వ్యాప్తంగా మొత్తం 95,296 మంది చేయూత పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి నెలకు రూ. 24,26,77,840 మేర పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే బుధవారం సాయంత్రం నాటికి 56,449 మందికి రూ.13,90,68,624 మాత్రమే అందజేశారు. ఇంకా 38,847 మందికి సంబంధించి రూ. 10,36,09,216 పింఛన్‌ సొమ్ము బకాయి పడింది.

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన యాదలక్ష్మికి చేయూత పింఛనే ఆధారం. ప్రతి నెలా 22వ తేదీ కల్లా వచ్చే పింఛన్‌ డబ్బులతోనే తనకు అవసరమైన మందులు కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు నెల ముగుస్తున్నా పింఛన్‌ రాక ఆమె పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పింఛన్‌ ఆలస్యంకావడంతో మందులు వేసుకోవడం కూడా వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆమె వాపోయింది.

ఆత్మకూరు ఎం మండలం తుక్కాపురం గ్రామానికి చెందిన చెరుకు యాదమ్మ గత నెల హైదరాబాద్‌కు పోవడంతో పింఛన్‌ తీసుకోలేదు. ఈనెల తీసుకుందామని రెండుసార్లు పోస్టాఫీస్‌కు వెళ్లింది.డబ్బులు లేవని చెప్పడంతో వెనుదిరిగింది. ఆమెకు మొత్తం రెండు నెలల పింఛన్‌ రావాల్సి ఉంది. పింఛన్‌ సకాలంలో రాక ఇబ్బందులు పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement