శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం వహించొద్దు | - | Sakshi
Sakshi News home page

శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం వహించొద్దు

Jul 31 2026 1:27 AM | Updated on Jul 31 2026 1:27 AM

యాదగిరిగుట్ట: శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం వహించొద్దని ఎస్పీ అక్షాంశ్‌ యాదవ్‌ సూచించారు. గురువారం యాదగిరిగుట్ట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేసి మొక్కలు నాటారు. కార్యాలయ నిర్వాహణ, పరిపాలన విధానాలు, నేరాల నమోదు, దర్యాప్తు పురోగతి, వివిధ రిజిస్టర్లు, అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సర్కిల్‌ పరిధిలోని తుర్కపల్లి, రాజాపేట, మోటకొండూర్‌, గుండాల పోలీస్‌ స్టేషన్లలోని స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్ల పనితీరు, శాంతి భద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పెండింగ్‌ కేసుల దర్యాప్తు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, బీట్‌ వ్యవస్థ, రాత్రి గస్తీ, కమ్యూనిటీ పోలీసింగ్‌, సైబర్‌ నేరాల నివారణ తదితర అంశాలపై సమీక్షించి, పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌ నాయుడు, రూరల్‌ సీఐ శంకర్‌గౌడ్‌, ఆయా పోలీస్‌ స్టేషన్ల ఎస్‌ఐలు పాల్గొన్నారు.

విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం

భూదాన్‌పోచంపల్లి: విద్యార్థులకు మెనూ పాటిస్తూ నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సూచించారు. గురువారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురంలో కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఈ విద్యా సంవత్సరం ఎంత మంది విద్యార్థినులు కొత్తగా నమోదయ్యారని ప్రత్యేకాధికారిణి ఇందిరను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, సరిపోను వసతులు, యూనిఫామ్స్‌ వచ్చాయా అని ఆరా తీశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అంజన్‌రెడ్డి, ఎంపీడీఓ విజయ, ఎంఈఓ ప్రభాకర్‌, ఎస్‌ఓ ఇందిర పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ పంటల సాగే మేలు

భువనగిరి : ప్రత్యామ్నాయ పంటల సాగే మేలని జిల్లా వ్యవసాయ అధికారి పీవీ రమణారెడ్డి అన్నారు. గురువారం భువనగరి మండలం వడపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ మానస అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఓ మల్లేష్‌, ఏఈఓ కృష్ణకుమారి, ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి మంజుల, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

సెప్టెంబర్‌ 8,9,10 తేదీల్లో రాష్ట్ర మహా సభలు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో సెప్టెంబర్‌ 8, 9, 10వ తేదీల్లో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర 3వ మహాసభలు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోద శ్రీరాములు తెలిపారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర 3వ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆయన గురువారం యాదగిరిగుట్టలో ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్‌, పార్టీ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్‌, ఏఐవైఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాఘవపురం వినయ్‌, కంబాల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement