ప్రవేశాలు అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

ప్రవేశాలు అంతంతే..

Jul 31 2026 1:27 AM | Updated on Jul 31 2026 1:27 AM

మెరుగైన ఫలితాలు ఉన్నా నిరాశే..

జిల్లాలో టార్గెట్‌ 50 వేలు.. నమోదైంది 45,591 మంది

జనగణన విధులు, ఉపాధ్యాయులపై అదనపు భారంతో బడిబాటకు విఘాతం

పదిలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నా పెరగని అడ్మిషన్లు

భువనగిరి: సర్కారు బడుల్లో ప్రవేశాల ప్రక్రియ తీవ్ర నిరాశ పరుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2026–27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల సంఖ్యను 50 వేల మార్కు దాటించాలన్న విద్యాశాఖ లక్ష్యం నీరుగారిపోయింది. ఆగస్టు నెలాఖరు వరకు గడువున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. గతేడాదితో పోలిస్తే ఇప్పటివరకు కేవలం 295 మంది విద్యార్థులు మాత్రమే కొత్తగా నమోదు కావడం గమనార్హం.

లక్ష్యం ఒకలా.. నమోదు మరోలా..

జిల్లా వ్యాప్తంగా మొత్తం 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి గాను యూడైస్‌లో నమోదైన ప్రకారం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో మొత్తం 45,296 మంది విద్యార్థులు ఉన్నారు. 2026–27 సంవత్సరానికి గాను, గత ఏడాది ఉన్న విద్యార్థుల సంఖ్యకు అదనంగా 10 శాతం మేరకు నమోదు పెరగాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సూచించారు. ఈ లెక్కన జిల్లాలో సుమారు 5 వేల మంది విద్యార్థులను అదనంగా బడిలో చేర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 50 వేలకు పైగా దాటాలి. కానీ, ఇప్పటి వరకు యూడైస్‌లో నమోదైన సంఖ్య 45,591 మాత్రమే. అంటే గత ఏడాదితో పోలిస్తే కేవలం 295 మంది మాత్రమే అదనంగా నమోదయ్యారు. దీంతో ప్రస్తుత అడ్మిషన్లు లక్ష్యానికి చాలా దూరంగా నిలిచాయి.

ఉపాధ్యాయులపై అదనపు భారం

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచేందుకు, ఏప్రిల్‌ నుంచి బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 16 నుంచి జూన్‌ 19 వరకు మరోసారి బడిబాట చేపట్టారు. అయితే, ఇదే సమయంలో మే 13 నుంచి జూన్‌ 9 వరకు ఉపాధ్యాయులకు జనగణనలో భాగంగా గృహాల లెక్కింపు విధులను అప్పగించారు. ఒకవైపు గృహాల సర్వే, మరోవైపు బడిబాట కార్యక్రమం నిర్వహించడం ఉపాధ్యాయులకు తీవ్ర భారంగా మారింది. పాఠశాలలు ప్రారంభమైన అనంతరం ఉదయం, సాయంత్రం వేళల్లో బడిబాట నిర్వహించినప్పటికీ అది అంతగా ప్రభావం చూపలేకపోయింది.

రెండు సంవత్సరాలుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఉత్తీర్ణత నమోదు చేస్తున్నారు. దీనికి తోడు, కొన్ని గ్రామాల్లో పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకూడదని గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు సైతం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలపై ఉపాధ్యాయులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడంలో విద్యాశాఖ వెనుకబడింది.

యూడైస్‌ లెక్కల ప్రకారం

విద్యార్థుల వివరాలు

సంవత్సరం విద్యార్థుల నమోదు

2023–24 47,456

2024–25 47,026

2025–26 45,296

2026–27 45,591

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement