మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో గల యాదవ కాలనీకి చెందిన మహిళలు తాగునీటి కోసం రోడ్డెక్కారు. మోత్కూరు–తిరుమలగిరి ప్రధాన రహదారిపై సుమారు అరగంట పాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ చెరువు కట్ట మరమ్మతుల కారణంగా నీటి సరఫరాను నిలిపి వేశారని, అయితే ఆ పనులు పూర్తయి 15 రోజులైనా నీళ్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. నెల రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు కట్ట పనుల సమయంలో నీటి సరఫరా పైపులు దెబ్బ తిన్నాయని, వాటి మరమ్మతుల విషయంలో మిషన్ భగీరథ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయలోపంతో కాల యాపన చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ అధికారులు రోజుకూ రెండు నుంచి మూడు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ అది ఏమాత్రం సరి పోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తొట్ల రుక్కమ్మ, ఎం.డి.కాజమ్మ, పురుగుల మల్లమ్మ, పురుగుల లింగమ్మ, జటంగి రేణుక, షబానా, పవిత్ర, లలిత, సారమ్మ తదితరులు పాల్గొన్నారు.


