హుజూర్‌నగర్ : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ కె. చంద్రశేఖర్, కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త సంధ్యారాణి సూచించారు. బుధవారం హుజూర్‌నగర్ మండలంలోని పలు గ్రామాలలో పొలాలను, వరి నారుమడులను వారు సందర్శించారు. ఈ సందర్భంగా నారుమళ్లలో పోషక లోపాలపై రైతులకు పలు సూచనలు చేశారు. గడ్డి, తుంగ జాతి కలుపు అధికంగా పెరిగిన నారుమడుల్లో సరైన కలుపు మందుల వినియోగంపై అవగాహన కల్పించారు. పెసర పంటలో చీడపీడలను నివారించేందుకు తీసుకోవాల్సి న జాగ్రత్తలను వివరించారు. మెట్ట నారుమడుల్లో పోషక లోపాలను అధిగమించేందుకు సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని ఆకులపై పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ స్వర్ణ, ఈఓ ప్రియాంక, రైతులు పాల్గొన్నారు.


