సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఈ ఉపకార వేతనం ఎంతో ఉపయోగపడనుంది. ఆర్థిక కారణాలతో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ స్కాలర్‌షిప్‌ను కేంద్రం తీసుకొచ్చింది. దీని ద్వారా పేద పిల్లలు విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఉపకార వేతనం ఇవ్వనుంది.
ఎనిమిదో తరగతి విద్యార్థులు అర్హులు..
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 7వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 7వ తరగతిలో 50శాతం మార్కులు, ఇతర విద్యార్థులు 55శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,50,000 లోపు ఉండాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ప్రధానోపాధ్యాయుడి సంతకంతో దరఖాస్తు ఫాంలను డీఈఓ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
నాలుగేళ్లు రూ.12వేల స్కాలర్‌షిప్..
ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్, గురుకుల పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. అనంతరం ఉన్నత విద్యలో కూడా పలు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం ఉంటుంది.
ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు
ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు
పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.12వేల చొప్పున ఉపకార వేతనం
ఆగస్టు 14 వరకు గడువు
ఈ పరీక్షకు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.50 పరీక్ష రుసుం ఆన్‌లైన్‌లో చెల్లించి బీఎస్‌ఈ.తెలంగాణ.జీవోవి.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 14వ తేదీ వరకు గడువు ఉంది. అక్టోబర్ 1న పరీక్షను రెవెన్యూ డివిజనల్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. పరీక్షను తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో రాయవచ్చు.


