మోత్కూరు: మరో రెండు నెలల్లో మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన రాజన్నగూడెం రహదారి పనులు పూర్తి కావాలని, లేనిపక్షంలో ఉపేంక్షించేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. శుక్రవారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన మోత్కూరు–రాజన్నగూడెం రోడ్డు పనులను శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి పరిశీలించి మాట్లాడారు. రూ.5.80 కోట్ల నిధులతో చేపట్టిన రహదారి మూడేళ్లుగా అసంపూర్తిగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా ఇప్పటికే జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇకపై పనుల్లో ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తి చేసిన వెంటనే కాంట్రాక్టర్‌కు బిల్లులు వచ్చేలా తానే స్వయంగా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాంబాబు, ఈఈ సరిత, డీఈఈ సురేందర్, ఏఈ మెంట స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, డీసీసీ ఉపాధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, మాజీ ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న తదితరులు ఉన్నారు.


