డీసీసీ అధ్యక్షుడిగా ఐలయ్య
సాక్షి, యాదాద్రి : ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను డీసీసీ పదవి వరించింది. యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఐలయ్యను నియమిస్తూ శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ అధ్యక్ష పదవికి పలువురు నాయకులు పోటీపడినప్పటికీ ఐలయ్యకు అవకాశం దక్కింది. డీసీసీ రేసులో లేనప్పటికీ ఐలయ్యకు పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలని పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభించి 2023లో ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన ఐలయ్య ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి నమ్మినబంటుగా ఐలయ్యకు పేరుంది.
ఆశావహులను కాదని..
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు అక్టోబర్‌లో జిల్లాకు వచ్చారు. భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే, ప్రస్తుత అధ్యక్షుడు అండెం సంజీరెడ్డిని కొనసాగించాలని ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు పరిశీలకులకు సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీ నియమావళి ప్రకా రం రెండోసారి అధ్యక్షుడిగా అవకాశం దక్కకపోతే.. భువనగిరి నియోజకవర్గానికి చెందిన తడ్క వెంకటేష్‌కు ఇవ్వాలని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి పరి శీలకులను కోరారు. ఈ పదవికి పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కోటాలో తమ ప్రయత్నాలు చేశారు. సుమారు 21 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల్లోంచి ఆరు పేర్లు ఎంపిక చేసి పీసీసీకి పంపించారు. అక్కడి నుంచి మూడు పేర్లు ఫైనల్ చేసి ఏఐసీసీకి గత నెల 25న పంపారు. చివరకు పార్టీ శ్రేణుల అంచనాలను తల్లకిందులు చేస్తూ అధిష్టానం.. ఐలయ్యకు డీసీసీ పీఠం కట్టబెట్టింది.
డీసీసీ అధ్యక్ష పదవితో నాపై మరింత బాధ్యత పెరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీఅధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ జయంతి నటరాజన్‌కు ధన్యవాదాలు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో పార్టీని ముందుకు తీసుకుపోతా. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తా.
ఫ రేసులో లేకున్నా.. వరించిన పదవి


