
తాళం వేసిన ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ
హుజూర్‌నగర్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ ఘటన హుజూర్‌నగర్ పట్టణంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ పట్టణంలోని ఏవీఎన్ అపార్ట్‌మెంట్ సమీపంలో నివాసముంటున్న గాయం వీరభద్రారెడ్డి గత నెల 19న తన బంధువు చనిపోవడంతో ఇంటికి తాళంవేసి హైదరాబాద్‌కు వెళ్లాడు. వారి ఇంట్లో పనిచేసే పనిమనిషి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా ఆ ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. ఆమె ఈ విషయాన్ని వీరభద్రారెడ్డికి తెలియజేసింది. వెంటనే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి చూడగా వంటగది తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి లాకర్‌లో దాచిన వజ్రాలు పొదిగిన బంగారపు నెక్లెస్, వడ్డాణం, జూకాలు, చెవి బుట్టలు, దిద్దులు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వాటి విలువ సుమారు రూ.25 లక్షలకు పైగా ఉంటుందని బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ చరమందరాజు, ఎస్‌ఐ మోహన్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్‌బాబు తెలిపారు.