
పోగొట్టుకున్న పర్సు అప్పగింత
చిట్యాల: బస్టాప్‌లో మహిళా ప్రయాణికురాలు పోగొట్టుకున్న పర్సును తిరిగి ఆమె కుమారుడికి ఆర్టీసీ అధికారులు అప్పగించారు. వివరాలు.. మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన వడ్డెపల్లి అంబబాయి తన కుమారుడితో కలిసి మంగళవారం చిట్యాలలో బస్టాండ్ ఎదురుగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గల బస్టాప్‌లో సూర్యాపేట డిపోకు చెందిన బస్సు ఎక్కి హైదరాబాద్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఆమె తన పర్సును పొగొట్టుకుంది. ఆ పర్సును చిట్యాలకు చెందిన శ్రీకనకదుర్గ ఆలయ డైరెక్టర్ రుద్రారపు లింగస్వామికి దొరకడంతో ఆయన వెంటనే బస్టాప్ వద్ద డ్యూటీలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి జంగయ్యకు అందజేశాడు. జంగయ్య సూర్యాపేట డిపోకు ఫోన్ చేసి బస్సులో ప్రయాణించిన మహిళ పర్సు పోగొట్టుకున్నట్లు సమాచారం ఇచ్చాడు. డిపో అధికారులు బస్సు డ్రైవర్ ద్వారా అందులో ప్రయాణిస్తున్న మహిళకు సమాచారం ఇవ్వగా.. ఆమె కుమారుడికి చిట్యాల ఆర్టీసీ కంట్రోలర్ పీబీ. చారి సమక్షంలో పర్సు తిరిగి అప్పగించారు.