
జింక్ లోపం నివారిస్తేనే అధిక దిగుబడులు
నాట్లు వేసిన తర్వాత..
గుర్రంపోడు: పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం తగ్గిపోతుండటం దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రసాయన ఎరువుల్లో ముఖ్య పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఉండటం.. సూక్ష్మపోషకాలు లేకపోవడం వలన దీర్ఘకాలికంగా రసాయన ఎరువుల మీద ఆధారపడి సాగుచేసే నేలల్లో సూక్ష్మపోషకాల లోపాలు ఏర్పడతాయి. తక్కువ పరిమాణంలో అవసరమమ్యే జింక్, బోరాన్, మెగ్నీషియం తదితర పోషకాలు పైరు ఎదుగుదలకు, మంచి దిగుబడులకు దోహదపడతాయి. వరి మాగాణుల్లో ఏర్పడే ముఖ్యమైన జింక్ లోప నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి తెలియజేశారు.
వరిలో జింక్ లోపానికి కారణాలు
వరిలో జింకు లోపం అధికంగా రావడానికి ముఖ్య కారణం సేంద్రియ ఎరువుల వినియోగం తక్కువగా ఉండటం. వరి సాగుకు ముందు పెసర, అలసంద, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి నేలలో కలియదున్నుతున్నారు. ఇది మినహా సేంద్రియ ఎరువుల వినియోగం వరిలో అత్యధిక విస్తీర్ణంలో లేనట్లే. వరిలో జింక్ లోపం ఏర్పడటానికి మరో ముఖ్య కారణం వరిసాగు చేసే నేలల్లో చౌడు ఉండటం. చౌడు వల్ల నేలల్లో ఉన్న జింకు మొక్కలకు సులభంగా అందుబాటులోకి రాక పైరులో జింకు లోపం ఏర్పడుతుంది. ఈ కారణాలే కాక రసాయనిక ఎరువులు సమతుల్యంగా వాడనప్పుడు, మురుగు నీరు సరిగా బయటకు వెళ్లని నేలల్లో సాగు చేసినప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు కూడా వరిలో జింకు లోపం కనిపిస్తుంది.
దిగుబడులపై ప్రభావం
జింకు లోపం ఉంటే ఏ పంటలోపైనా రసాయన ఎరువులు తీసుకునే శక్తి తగ్గిపోయి వేసిన ఎరువులు వృథా అవుతాయి. వరిలో వచ్చే జింకు లోపం పంట పెరుగుదల, దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జింకు లోపం ఉన్నప్పుడు నాటిన పైరు అనారోగ్యంగా కనిపిస్తుంది. పిలకలు తక్కువగా ఆలస్యంగా వస్తాయి. అంతేగాక వచ్చిన పిలకలు సరిగా పెరగక పైరు నశించినట్లు గిడసబారి కనిపిస్తుంది. లేత ఆకులు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపైరు కళ తప్పి కనిపిస్తుంది. జింకు లోపం తీవ్రత అధికంగా ఉన్న చోట్ల అడుగు ఆకులు ఎండిపోతాయి. ఈ విధంగా పైరు పెరుగుదలకు ఇబ్బంది కలిగి దిగుబడులు తగ్గుతాయి. జింకు ధాతు లోపం ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది. కాలక్రమేణా పోషకాల యాజమాన్యంలో వచ్చిన మార్పులు దీనికి కారణం. వరిలో దిగుబడులు తగ్గకుండా ఉండటానికి సరైన జింక్ పోషక యాజమాన్యాన్ని ఆచరించాలి.
నివారణ చర్యలు
జింకు లోప నివారణకు అన్నింటికంటే మొదట చేయాల్సింది పంటకు అవసరమైన పోషకాల్లో కనీసం 30 శాతం సేంద్రియ ఎరువుల ద్వారా అందించాలి. పశువుల ఎరువును తప్పనిసరిగా తోలించడం, ఇతర జీవన ఎరువులను వాడటం చేయాలి. సేంద్రియ ఎరువులు వినియోగించడానికి వీలు కానప్పుడు వరి నాటడానికి ముందు ఎకరాకు 20 కిలోల వంతున జింకు సల్ఫేట్ దమ్ములో వేసి పైరులో జింకు లోపం ఏర్పడకుండా నివారించుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ జింకు సల్ఫేట్ దమ్ములో వేసినప్పుడు భాస్వరపు ఎరువులలో కలిపి వేయరాదు. జింకు సల్ఫేట్ వేయడానికి ముందు, తర్వాత రసాయన ఎరువులు వేయడానికి నాలుగు రోజల విరామం ఉండాలి. జింకు సల్ఫేట్‌ను ఖరీఫ్, రబీ పంటలకు కలిపి ఒకసారి వేస్తే సరిపోతుంది.
వరి నాట్లు పూర్తయి దమ్ములో జింకు సల్ఫేట్ వేయని పొలాల్లో పైరుపై జింకు సల్ఫేట్ పిచికారీ చేసి కూడా జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. వరి నాట్లు వేసిన తర్వాత జింక్ లోపం కనిపిస్తే చిలేటెడ్ జింక్ రెండు గ్రాములు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే 20రోజుల వ్యవధిలో మరో దఫా ఇదే మోతాదును పిచికారీ చేసుకోవాలి. జింక్‌ను వరి పొలంలో పిచికారీ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుగు మందులు లేదా తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. చౌడు నేలల్లో జింకు సల్ఫేట్‌ను దమ్ములో వేయడం కంటె రెండు దఫాలుగా పిచికారీ చేసుకోవడం లాభదాయకం.
ఫ గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచనలు

జింక్ లోపం నివారిస్తేనే అధిక దిగుబడులు