
కాపర్ వైరు చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్
కోదాడరూరల్: జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైరు చోరీ చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను మంగళవారం సూర్యాపేట జిల్లా మునగాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన పాలపర్తి వెంకట్రామయ్య పాత ఇనుము వ్యాపారం చేసేవాడు. అతడికి ఒంగోలు పట్టణానికే చెందిన బలిగా శ్రీకాంత్, గుంటకళ్ల ఖాజేశ్వరరావు, బోయపాటి అశోక్‌కుమార్, దేవరకొండ ఇషాక్ పరిచయమయ్యారు. వీరంతా చెడు వ్యసనాలకు బానిసలై చోరీలకు పాల్పడుతూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరు ఈ ఏడాది మార్చి, మే నెలల్లో కారు అద్దెకు తీసుకొని సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు(ఎన్‌ఎస్పీ) కాల్వపై లిఫ్ట్ మోటార్లకు ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైరును చోరీ చేశారు. చోరీ చేసిన కాపర్ వైరును ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లోని పలు ఫ్యాక్టరీలకు కేజీ రూ.400 చొప్పున విక్రయించారు. అదే మాదిరిగా మునగాల మండలం బరాఖత్‌గూడెం గ్రామ శివారులో ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైరు దొంగతనం చేసేందుకు వచ్చి అనుమానాస్పదంగా కనిపించడంతో పాలపర్తి వెంకట్రామయ్య, గుంటకళ్ల ఖాజేశ్వరరావు, బోయపాటి అశోక్‌కుమార్, దేవరకొండ ఇషాక్‌ను మంగళవారం మునగాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మరో వ్యక్తి బలిగా శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.2.50లక్షల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకున్న మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, సీసీఎస్ సీఐ శివకుమార్, ఎస్‌ఐలు హరికృష్ణ, యాదవేందర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది రామారావు, కొండలు, మల్లేష్, శివ, ఆనంద్, శ్రీనును సూర్యాపేట ఎస్పీ నరసింహ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.
ఫ పోలీసుల అదుపులో
నలుగురు నిందితులు
ఫ మరొకరు పరారీ
ఫ రూ.2.50లక్షల నగదు స్వాధీనం