
ఎన్‌సీసీ జాతీయ శిబిరానికి ఆలేరు క్యాడెట్లు ఎంపిక
ఆలేరు: నేషనల్ క్యాడెట్ కారప్స్(ఎన్‌సీసీ) జాతీయ శిబిరానికి ఆలేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఎన్‌సీసీ యూనిట్‌కు చెందిన పది మంది క్యాడెట్‌లు ఎంపికయ్యారు. వరంగల్ జిల్లాలోని పోలీసు శిక్షణ కేంద్రం(పీటీసీ)లో ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’ పేరుతో మంగళవారం ప్రారంభమైన ఎన్‌సీసీ జాతీయ శిబిరం ఈ నెల 13వ తేదీ వరకు జరుగనుంది. ఆలేరు ఎన్‌సీసీ యూనిట్ నుంచి 9, 10వ తరగతులకు చెందిన ఐదుగురు విద్యార్థినులు, ఐదుగురులు విద్యార్థులతో పాటు ఎన్‌సీసీ యూనిట్ అధికారి దూడల వెంకటేష్ ఈ శిబిరంలో పాల్గొననున్నారు. ఈ క్యాంపులో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఘండ్ రాష్ట్రాలకు చెదిన ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొంటున్నారు. 12రోజుల పాటు జరుగనున్న జాతీయ శిబిరంలో ఆయా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, వంటలు తదితర అంశాలను ఎన్‌సీసీ క్యాడెట్‌లు పరస్పరం పంచుకుంటారని ఎన్‌సీసీ యూనిట్ అధికారి దూడల వెంకటేష్ చెప్పారు. అంతేకాకుండా చారిత్రక కట్టడాలు, వివిధ అంశాలపై క్షేత్రస్థాయి పర్యటనలతో ఎన్‌సీసీ క్యాడెట్లకు అవగాహన కల్పిస్తారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఎన్‌సీసీ క్యాడెట్లలో జాతీయ సమైకత్యను పెంపొందించడమే ఈ జాతీయ శిబిరం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.