
వయ్యారిభామతో ప్రమాదమే
వయ్యారిభామ కలుపు మొక్కలు ఎంతో ప్రమాదకరమైనప్పటికి వాటిని ఉపయోగించుకొని కంపోస్టు ఎరువును తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం నీరు నిలవని చోట 3 మీటర్ల లోతు, 6 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు ఉండేవిధంగా గుంత తవ్వుకోవాలి. ఇందులో 50 కిలోల వయ్యారిభామ మొక్కలు వేసి వాటిపై 5 కిలోల యూరియా, 50 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి చల్లుకోవాలి. ఈ విధంగా పొరలుగా గుంతను డోము ఆకారంలో నింపుకోవాలి. పొరలపైన పేడ, మట్టి, ఊక మిశ్రమాన్ని వేసి కప్పేసుకోవాలి. ఈ కంపోస్టులో నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు అధికంగా ఉంటాయి. ఇలా తక్కువ ఖర్చుతో చేసుకొని అన్ని పంటలకు సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవచ్చు.
త్రిపురారం : పొలంలో వచ్చే తెగుళ్లు, చీడపీడలకంటే రైతులు అధికంగా భయపడేది వయ్యారిభామ (పార్థినీయం) కలుపు మొక్కతోనే. ఈ మొక్కలు ఎక్కడైనా పెరిగే లక్షణం ఉంటుంది. ఈ కలుపు మొక్క ప్రధాన పంటలకు తీవ్రంగా నష్టం కలిగిస్తుంది. మొలిచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో పార్థినీయం మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతోపాటు దూర ప్రాంతాలకు సైతం త్వరగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క లక్షణాలు, నివారణ చర్యల గురించి కేవీకే కంపాసాగర్ సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ మాటల్లోనే..
మనుషులు, పశువులకూ హాని..
వయ్యారిభామ కలుపు మొక్క వల్ల పంటలకే కాకుండా మనుషులు, పశువులకు కూడా ప్రమాదమే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులు సోకడంతో పాటు చర్మ వ్యాధులు వస్తాయి. జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు తలెత్తుతాయి. ఈ మొక్కలు తిన్న పశువులు హైపర్ టెక్షన్‌కు గురువుతాయి. పశుగ్రాసాల పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. ఇక పంటలకు నీరు పోషకాలు అందకుండా వాటి కంటే ముందే ఈ మొక్కలు గ్రహించుకుంటాయి. తద్వారా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపి సుమారు 40 శాతం మేర తక్కువ దిగుబడులు వస్తాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారిభామ పుప్పడి పడడం వల్ల ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదం ఎక్కువ. పార్థినీయం మొక్కను నిర్మూలించడానికి రైతులు తప్పనిసరిగా సమగ్ర యాజమాన్య సంరక్షణ చర్యలు చేపట్టాలి.
తొలగించే విధానం
పార్థినీయం మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే పూత దశకు రాకముందే తొలగించి మంటల్లో కాల్చివేయాలి. లేకపోతే ఈ మొక్కలు ముదిరితే వాటి వ్యాప్తిని నివారించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ పూత దశకు చేరుకున్న మొక్కలను తొలగించాలంటే చేతులకు గ్లౌజులు, ముక్కుకు మాస్కులు ధరించాలి. తీసిన మొక్కలను కుప్పగా వేసి కాల్చివేయాలి. రసాయనాలతో మొక్కజొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటర్ నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకుంటే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు లీటర్ నీటికి 2 ఎంఎల్ పేర్వాక్వాట్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పశుగ్రాసాలు సాగు చేసుకునే రైతులు పంట వేయకముందే లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఫ ఈ కలుపు మొక్కతో పంటలకు నష్టం
ఫ పూత దశకు ముందే తొలగించాలి
ఫ రైతులకు కేవీకే శాస్త్రవేత్త
డాక్టర్ చంద్రశేఖర్ సూచనలు

వయ్యారిభామతో ప్రమాదమే