
ఆపరేషన్ వికటించి బాలుడి మృతి
మర్రిగూడ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించగా.. ఆపరేషన్ వికటించి శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన బల్లెం అబ్బయ్య, స్వరూప దంపతులకు ఇద్దరులు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వారి పెద్ద కుమారుడు బల్లెం ప్రణయ్(11) గత రెండు సంవత్సరాల నుంచి తలసేమియా వ్యాధిలో బాధపడుతున్నాడు. ప్రణయ్‌కు ఆపరేషన్ అవసరమని డాక్టర్లు నిర్ధారించారు. ఆపరేషన్‌కు రూ.25లక్షలు అవసరం కాగా.. అందులో రూ.20లక్షలు ప్రభుత్వం ఇవ్వగా.. మరో రూ.5లక్షలు ఇచ్చేందుకు ఇందూర్తి గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కుంభం శ్రీనివాస్‌రెడ్డి ముందుకు రావడంతో ఆపరేషన్ కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం బాలుడికి వైద్యులు ఆపరేషన్ చేయగా.. ఆపరేషన్ వికటించి మృతిచెందాడని కుటుంబసభ్యులు, బంధువులు విలపించారు.
బావిలో దూకి
వివాహిత ఆత్మహత్య
మోత్కూరు: అనారోగ్య సమస్యలు, మానసిక స్థితి సక్రమంగా లేని వివాహిత బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుజిలాపురం గ్రామానికి చెందిన కాసగాని వెంకన్నకు గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సరిత(35)తో 2010లో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకన్న వ్యవసాయం, కల్లు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సరిత ఆదివారం తెల్లవారుజామున తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో భార్య కనిపించకపోవడంతో వెంకన్న గ్రామస్తులతో కలిసి బావి దగ్గరకు వెళ్లి చూడగా సరిత మృతదేహం కనిపించింది. తమ కుమార్తె కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, అంతేకాకుండా ఆమె మానసిక స్థితి సక్రమంగా లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతురాలి తండ్రి వల్లందాసు చంద్రయ్య పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ కె. సతీష్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెట్లపొదల్లో నవజాత శిశువు గుర్తింపు
మునగాల: మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ ఇంటి ఆవరణలోని చెట్ల పొదల్లో ఆదివారం మధ్యాహ్నం నవజాత మగ శిశువును గ్రామస్తులు గుర్తించారు. గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యురాలి ఇంటి సమీపంలోని చెట్ల పొదల్లో నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా.. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తించారు. పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద శిశువుకు ప్రథమ చికిత్స చేయించి హుటాహుటిన సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొక్కిరేణి గ్రామానికి చెందిన ఓ యువతి ప్రసవం కోసం తిమ్మారెడ్డిగూడెంలోని ఆర్‌ఎంపీ వైద్యురాలి వద్దకు రాగా.. ఆమె అందుబాటులో లేకపోవడంతో సదరు యువతి బిడ్డకు జన్మనిచ్చి అక్కడే వదలి వెళ్లినట్లు తెలిసింది.

ఆపరేషన్ వికటించి బాలుడి మృతి

ఆపరేషన్ వికటించి బాలుడి మృతి