
స్పీడ్‌గా తపాలా సేవలు
నాగారం: రిజిస్టర్ పోస్ట్ అనేది ప్రజలకు తపాలా శాఖ అందించిన అత్యుత్తమమైన సేవ. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ రావాలన్నా, ఉద్యోగం నియామక పత్రం అందాలన్నా, బంధుమిత్రులకు ప్రధాన వర్తమానం, సంస్థలు, కార్యాలయాలకు ముఖ్యమైన పత్రాలు పంపాలన్నా ఒకప్పుడు రిజిస్టర్ పోస్టే ఆధారం. ఒక రకంగా చెప్పాలంటే రిజిస్టర్ పోస్ట్ అంటే ఓ భరోసా. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లేని రోజుల్లో ప్రజల జీవితాలతో అది విడదీయరాని బంధాన్ని రిజిస్టర్ పోస్ట్ ఏర్పరచుకుంది. ముఖ్యమైన పత్రాలు, వస్తువులను ఒక చోటు నుంచి మరోచోటుకు సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి ప్రధాన మార్గంగా నిలిచింది. రాఖీలు, చిన్నచిన్న వస్తు సామగ్రి, లీగల్ నోటీసులు, అపాయింట్‌మెంట్ లెటర్లు, బ్యాంకింగ్‌కు సంబంధించిన పత్రాలు ఇలా ఎన్నో విలువైన పత్రాలను పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువులు, పత్రాలు అవతలి వారికి చేరినట్లు రశీదు పొందితే.. హమ్మయ్య అని గుండెలపై చేయి వేసుకునే వారెందరో ఆ రోజుల్లో. అలాంటి సేవలు ఇక నుంచి కాలగర్భంలో కలిసిపోనున్నాయి. సోమవారం నుంచి రిజిస్టర్ పోస్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు భారత తంతి తపాలా శాఖ ప్రకటించింది. దాని స్థానంలో స్పీడ్ పోస్ట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
కాలానుగుణంగా మార్పులు..
మారుతున్న కాలానికి అనుగుణంగా భారత తంతి తపాలా శాఖ కూడా మారుతోంది. ప్రైవేట్ సంస్థలతో పోటీపడుతూ ఇప్పటికే ఎన్నో సేవలను ప్రవేశపెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న పోస్టల్ శాఖ.. అంతే వేగంగా స్పీడ్ పోస్ట్ విధానానికి శ్రీకారం చుడుతోంది. బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న రిజిస్టర్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్ట్‌లో కలుపుతున్నట్లు భారత తంతి తపాలా శాఖ ప్రకటించింది. ప్రజలు తాము పంపిన వస్తువులు, పత్రాలు ఎక్కడి వరకూ చేరుకున్నాయనే సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటు కల్పించడానికి ట్రాకింగ్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ స్పీడ్ పోస్ట్ విధానంతో తంతి తపాలా శాఖ అధునాతన కొరియర్ వ్యవస్థలకు పోటీగా సేవలు అందిస్తుందన్న అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతుతోంది.
ఫ నేటి నుంచి నిలిచిపోనున్న రిజిస్టర్ పోస్ట్