
కుక్కల దాడి.. గొర్రెలు మృతి
చిట్యాల: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన బైకాని లింగస్వామి మేకల దొడ్డిపై, ఏర్పుల రామనర్సింహకు చెందిన గొర్రెల దొడ్డిపై ఆదివారం కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో బైకాని లింగస్వామికి చెందిన నాలుగు మేకలు, ఏర్పుల రామనర్సింహకు చెందిన రెండు గొర్రెలు మృతిచెందాయి. మృతిచెందిన మేకలు, గొర్రెల విలువ సుమారు రూ.60వేలకు పైగా ఉంటుందని బాధితులు తెలిపారు.
సైనిక లాంఛనాలతో
అంత్యక్రియలు పూర్తి
ఆత్మకూర్(ఎస్): ఆత్మకూర్(ఎస్) మండలం ఎనుబాముల గ్రామానికి చెందిన సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ కలకోట్ల శ్రీను(47) శనివారం చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. ఆదివారం స్వగ్రామం ఎనుబాములలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి సీఆర్‌పీఎఫ్ అధికారులు తమ సిబ్బందితో వచ్చి మృతుడి భార్య మంజులకు జాతీయ జెండాతో పాటు అతడి దుస్తులు, బ్యాడ్జీ రూ.75 వేల నగదు అందజేశారు. శ్రీను భౌతికకాయంపై జాతీయ జెండా కప్పారు. అనంతరం గాల్లోకి 3 రౌండ్లు ఫైరింగ్ చేసి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఎస్‌ఎల్ నాయక్, యాదయ్య, సోమయ్య, నాగయ్య, జనిమియా, చంద్రయ్య, సూర్యాపేట మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం తదితరులు పాల్గొన్నారు.
మూసీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఆదివారం అధికారులు నాలుగు క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు 6,525 క్యూసెక్కుల నీరు మూసీ రిజర్వాయర్‌కు వస్తోంది. క్రస్టు గేట్ల ద్వారా 5,625 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 96 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 144 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం 643.80 అడుగుల మేర నీటి మట్టం ఉంది.

కుక్కల దాడి.. గొర్రెలు మృతి