
పటేల్ శ్రీధర్‌రెడ్డి కృషి అభినందనీయం
సూర్యాపేట: స్ప్రెడ్ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి, 25 ఏళ్లుగా నిరక్షరాస్యత నిర్మూలనకు పటేల్ శ్రీధర్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ కవి అందెశ్రీ అన్నారు. సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామానికి చెందిన స్ప్రెడ్ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పటేల్ శ్రీధర్‌రెడ్డి అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఆదివారం ఆయనకు సూర్యాపేట పట్టణంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభకు అందెశ్రీతో పాటు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కవి అందెశ్రీ మాట్లాడుతూ.. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్య కేంద్రాలు నెలకొల్పి అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత శ్రీధర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. అనంతరం పటేల్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట నియోజకవర్గంలో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్ప్రెడ్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా ఏడేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. బాలెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, గ్రీన్ బోర్డులు, బెంచీలు అందజేయడంతో పాటు సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, కళావేదిక, వంటగదులు, మోడల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారని, రెండు ఎకరాల ఉచితంగా అందించి క్రీడా స్థలాన్ని, బాస్కెట్‌బాల్ కోర్టు నిర్మించారన్నారు. శ్రీధర్‌రెడ్డి సొంత నిధులతో పాటు ప్రభుత్వ సహకారంతో రూ.45 లక్షలతో శిథిలావస్థకు చేరిన సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
కవి అందెశ్రీ