
పక్కా భవనాలు.. తీరనున్న వెతలు
ఐదు ఎకరాల్లో రామన్నపేట కోర్టు
శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి
సాక్షి, యాదాద్రి : భువనగిరి, రామన్నపేట, ఆలేరు కోర్టులకు మహర్దశ పట్టనుంది. అద్దె భవనాల్లో సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్న వాటికి శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి రూ.81 కోట్లు, రామన్నపేట కోర్టు నూతన భవనాలు, రెసిడెన్సియల్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ. 34.50 కోట్లు, ఆలేరు కోర్టుకు రూ.18 కోట్లు మంజూరయ్యాయి. కాగా జిల్లా కోర్టు భవన నిర్మాణానికి సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
మాస్‌కుంట గుట్టపై పది ఎకరాలు కేటాయింపు
భువనగిరిలో ప్రస్తుతం కోర్టు నిర్వహిస్తున్న అద్దె భవనాలు అనువుగా లేవు. ఇరుకుగా ఉండటం, సౌకర్యాలు సరిగా లేకపోవడంతో కక్షిదారులకు సేవలందించడం, న్యాయమూర్తులు, అడ్వకేట్‌ల కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను పలుమార్లు రాష్ట్ర హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో నూతన భవనాలను మంజూరు చేసింది. నూతన భవనాన్ని భువనగిరి సమీపంలోని మాస్ కుంట గుట్టపై నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం గుట్టపై సర్వేనంబర్ 742లో ప్రభుత్వం పది ఎకరాల స్థలం కేటాయించింది. ఈ స్థలంలో నాలుగు అంతస్తుల్లో 12 భవనాలు నిర్మిస్తారు. జిల్లా కోర్టులు, న్యాయమూర్తుల క్వార్టర్స్, పరిపాలన భవనాలు, బార్ అసోసియేషన్ భవనం, పార్క్‌లు, పార్కింగ్ ఏరియా, లాన్స్ రానున్నాయి. తొలుత కోర్టు భవనాలను, చుట్టూ ప్రహరీ, అంతర్గత రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. న్యాయమూర్తుల క్వార్టర్స్, ఇతర నిర్మాణాలను తర్వాత చేపట్టనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తవడంతో గుట్టను చదును చేస్తున్నారు. జిల్లా ప్రధాన జడ్జి జయరాజ్ ఆధ్వర్యంలో ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్‌ఆండ్‌బీ అధికారులు శంకుస్థాపన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రామన్నపేట శివారులోని కొమ్మాయిగూడెం మార్గంలో సర్వే నంబర్ 584లో ఐదు ఎకరాల స్థలాన్ని కోర్టు నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. నాలుగు భవనాల నిర్మాణానికి రూ.29 కోట్లు, క్వార్టర్స్‌కు రూ 5.50కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
జిల్లా కోర్టు భవన నిర్మాణానికి మాస్‌కుంట గుట్టపై ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించింది. రూ.81 కోట్లు మంజూరు చేయగా పనుల నిర్వహణకు టెండర్లు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. భవన నిర్మాణ పనులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి గుట్టపై ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం.
–జయరాజ్, జిల్లా ప్రధాన జడ్జి
భువనగిరి, రామన్నపేట, ఆలేరు కోర్టులకు శాశ్వత భవనాలు
ఫ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
ఫ జిల్లా కోర్టు భవన సముదాయానికి సెప్టెంబర్ మొదటి వారంలో శంకుస్థాపన
ఫ మాస్‌కుంట గుట్టపై కొనసాగుతున్న ఏర్పాట్లు