
తరగతి గదులకు తలుపుల్లేవు సార్
ఆలేరు: తరగతి గదులకు కిటీకీలు, తలుపులు లేవు సార్, రాత్రి సమయంలో, వర్షాలు కురిసినప్పుడు విష పురుగులు వచ్చే అవకాశం ఉందని ఆలేరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థినులు కలెక్టర్ హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లారు. శనివారం పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి ప్రార్థన చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల హాజరు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కూరగాయలు, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. తరగతి గదులకు కిటికీలు,తలుపులు లేక అసౌకర్యం కలుగుతుందని విద్యార్థినులతో పాటు ప్రిన్సిపాల్ మామిడి వెంకటమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కిచెన్‌షెడ్ రేకుల కప్పు సరిగా లేక ఇబ్బంది అవుతుందని, పాఠశాలకు సరైన డ్రైయినేజీ వ్యవస్థ లేదని, ప్రహరీగోడకు మరమ్మతులు చేయించాలని కలెక్టర్‌ను కోరారు. వెంటనే కలెక్టర్ పంచాయతీరాజ్ ఈఈకి ఫోన్ చేసి పెండింగ్ సివిల్ పనులు, అవసరమైన మరమ్మతులు పూర్తి చేయించాలని ఆదేశించారు. పరిసరాల్లో పిచ్చిమొక్కలు,గడ్డిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌కు సూచించారు.
నాణ్యత లేని పప్పుధాన్యాల గుర్తింపు
నాణ్యత లేని పప్పుధాన్యాలను కలెక్టర్ గుర్తించారు. వాటిని వెంటనే మార్చాలన్నారు. రేషన్ సరుకులతో పాటు కూరగాయలు నాణ్యమైనవి వినియోగించాలని స్పష్టం చేశారు. తమ జీవిత లక్ష్యాలు ఏమిటని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాల సాధనకు నిరంతరం కృషి చేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఫ కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదు
ఫ ఆలేరు రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల తనిఖీ