
మాకూ పదోన్నతులు ఇవ్వండి
జీఓ నంబర్లు 11,12
సవరణకు డిమాండ్
పీఎస్‌హెచ్‌ఎం పోస్టుల్లో అర్హత కల్పించాలంటున్న బీఈడీ ఎస్‌జీటీలు
భువనగిరి: బీఈడీ అర్హత ఉన్న ఎస్‌జీటీలు ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టుల్లో తమకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అర్హత, అనుభవం కలిగి, బీఈడీ పూర్తి చేసిన తమను ప్రస్తుతం చేపట్టిన పదోన్నతుల్లో పరిగణలోకి తీసుకోకపోవడంతో వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఈడీ కలిగి ఎస్‌జీటీలు పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం కొంతకాలంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. జీఓ 11,12లను సవరించి బీఈడీ అర్హత కలిగిన ఎస్‌జీటీలకు సైతం పీఎస్ హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి లేఖ అందజేశారు.
గతంలోనే నియామకం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008 సంవత్సరం వరకు నిర్వహించిన డీఎస్సీల్లో ఇంటర్, డీఈడీ పూర్తిచేసిన వారితో పాటు డిగ్రీ, బీఈడీ ఉన్న అభ్యర్థులు కూడా ఎస్‌జీటీలుగా నియమింపబడ్డారు. తర్వాత కాలంలో డీఈడీ చేసిన వారిని మాత్రమే ఎస్‌జీటీ పోస్టులకు అర్హులని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తర్వాత కాలంలో డీఈడీ చేసిన వారిని మాత్రమే ఎస్‌జీటీ పోస్టులకు అర్హులుగా పరిగణించారు. దీంతో బీఈడీ అర్హతతో ఎస్‌జీటీలుగా నియామకమైనా ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల హెచ్‌ం పదోన్నతికి తిరస్కరణకు గురవుతున్నారు. 2015, 2024 సంవత్సరాలతో పాటు తాజాగా ఈ నెలలో పదోన్నతుల ప్రక్రియ చేపట్టారు. ఆయా సంవత్సరాల్లో బీఈడీ ఉన్న ఎస్‌జీటీ ఉపాధ్యాయులు, లాంగ్వేజ్ పిండిత్‌లకు ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా పదోన్నతులు లభించలేదు.
బీఈడీ చేసిన ఎస్‌జీటీలు ఇలా..
జిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ఇందులో 484 ప్రాథమిక, 68 ప్రాథమికోన్నత, 163 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 1,086 ఎస్‌జీటీలు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రస్తుతం 528 మంది బీఈడీ చేసిన ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సీనియార్టీ ఉన్నవారంతా పీఎస్ హెచ్‌ఎం పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.
జీఓ నంబర్ 11,12ను సవరించి పీఎస్ హెచ్‌ఎం పోస్టులకు డీఈడీ టీచర్లతో పాటు బీఈడీ చేసిన ఎస్‌జీటీలను కూడా అర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ జీఓల వల్ల అర్హత ఉన్నా పదోన్నతుల అవకాశాలను కోల్పోతున్నామని అందోళన చెందుతున్నారు.
ఫ ప్రస్తుత ప్రమోషన్లలో చోటుకోసం డిమాండ్
ఫ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇటీవల లేఖ
ఫ జిల్లాలో 1,086 మంది ఎస్‌జీటీలు.. వీరిలో 528 మంది బీఈడీ చేసినవారే