
మెరుగైన సౌకర్యాలపై దృష్టి
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దృష్టి కేంద్రీకరించామని దేవాదాయ, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. శుక్రవారం యాదగిరి కొండపైన గల అతిథి గృహంలో వైటీడీఏ సీఈఓ, వీసీ కిషన్‌రావు, ఈఓ వెంకట్రావ్, కలెక్టర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఇతర శాఖల అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులు, టెంపుల్ సిటీ జియోగ్రాఫికల్ ఏరియా ఫైనలైజేషన్‌కు సంబంధించి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో శ్రీస్వామి వారి క్షేత్ర మహత్యానికి సంబంధించిన బొమ్మల పుస్తకాన్ని, మాడ వీధిలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ప్రారంభించారు. గరుఢ ట్రస్టుకు సంబంధించిన ప్రాథమిక విధివిధానాల్లో భాగంగా ఏర్పాటు చేసిన లిస్టును సైతం తెలిపారు. రూ.50వేలకు పైనా విరాళం గరుఢ ట్రస్టుకు ఇస్తే రూ.300 టికెట్‌పై సంవత్సరంలో ఆరుగురు చొప్పున 2 పర్యాయాలు బ్రేక్ దర్శనం, రూ.150 టికెట్‌పై ఆరుగురు చొప్పున 2 పర్యాయాలు బ్రేక్ దర్శనం సదుపాయం కల్పించనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్‌కు ఈఓ తెలిపారు. అంతే కాకుండా రూ.లక్షకు పైగా గరుఢ ట్రస్ట్‌కు చెల్లిస్తే బ్రేక్ దర్శనం రూ.300 టిక్కెట్‌పై ఆరుగురు చొప్పున 4 పర్యాయాలు, రూ.150 బ్రేక్ దర్శనంపై ఆరుగురు 4 పర్యాయాలు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇక రూ.2లక్షలపైన చెల్లిస్తే రూ.300 బ్రేక్ దర్శనంపై ఆరుగురు చొప్పున 8 పర్యాయాలు, కొండ కింద గల యాదరుషి నిలయంలో డబుల్ బెడ్ రూంను కేటాయించనున్నట్లు వివరించారు. తరువాత దేవస్థానం పరిధిలోని గోశాల, లక్ష్మీ పుష్కరిణితో పాటు, వేద పాఠశాల నిర్మాణం పనులను పరిశీలించారు. అంతకు ముందు శ్రీస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి, దేవాదాయశాఖ ఉప కమిషనర్లు వినోద్‌రెడ్డి, కృష్ణ ప్రసాద్, వెంకటేష్, తహసీల్దార్ గణేష్ నాయక్, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి పాల్గొన్నారు.
ఫ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
ఫ యాదాద్రి ఆలయాభివృద్ధి,
టెంపుల్ సిటీ జియోగ్రాఫికల్
ఏరియా ఫైనలైజేషన్‌పై సమీక్ష