
బంగారం చోరీ కేసులో మరోవ్యక్తి అరెస్టు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయిసంతోషి జ్యుయలరీ షాపులో గత నెల 21న అర్ధరాత్రి జరిగిన భారీ దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. నిందితుడి నుంచి 25తులాల బంగారం, రూ.4,84,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివ కుమార్‌ల ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక బృందం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి సాంకేతిక ఆధారాలు, నమ్మదగిన సమాచారంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న పశ్చిమబెంగాల్ రాష్ట్రం మల్దా జిల్లాకు చెందిన ఏ5 జషిముద్దీన్‌ను ఈ నెల 26 మాల్దా జిల్లా, రత్వా పోలీస్ స్టేషన్ పరిధి, ఒకేరా చాంద్‌పరా మండలం అందారు గ్రామంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 25తులాల బంగారు ఆభరణాలు, రూ.4,84,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ చాచల్ కోర్టులో న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టి 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి తీసుకుని నిందితుల రాష్ట్రాల బదిలీ (ట్రాన్సిట్) నిబంధనల ప్రకారం సూర్యాపేటకు తీసుకువచ్చారు. నిందితుడిని జషిముద్దీన్‌ను విచారించగా నేపాల్‌కు చెందిన ఏ1 ప్రకాశ్ అనిల్ కుమార్, ఏ2 కడక్ సింగ్ అహుల్ వాలియ, ఏ3 పురన్ ప్రసాద్ జోషి, పశ్చిమబెంగాల్ రాష్ట్రం మల్దా జిల్లాకు చెందిన ఏ4 మాలిక్ మొల్లతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెక్కీ నిర్వహించి సాయి సంతోషి జ్యువెలరీ షాప్‌లో బంగారం, నగదు దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. అనంతరం కిరాయికి తీసుకున్న ఇంటికి వెళ్లి దొంగతనం చేసిన సొత్తును 5 భాగాలుగా పంచుకొని ఈ దొంగతనంలో సహకరించిన ఏ7 యశోద, ఏ6 అమర్ బట్‌లకు ఖర్చుల కోసం కొంత బంగారం, డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పారిపోయినట్లు విచారణలో పేర్కొన్నాడు. ఏ6 నిందితుడైన అమర్ బట్ వాటాకు వచ్చిన బంగారం ఏ1 ప్రకాష్ అనిల్ కుమార్ వద్ద ఉంచి ఆ బంగారాన్ని నేపాల్‌లో తీసుకునేటట్లుగా అనుకున్నారని విచారణలో నిందితుడు పోలీసులకు తెలిపాడు.
ఇప్పటివరకు నలుగురు దొంగలు అరెస్టు
బంగారం దొంగతనం కేసులో మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. మొదట అరెస్ట్ చేసిన ఏ7 నిందితురాలు యశోద నుంచి 14 తులాల బంగారం, ఈ నెల 11న వెస్ట్ బెంగాల్‌లో ఏ4 నిందితుడు మాలిక్ మొల్ల నుంచి సుమారు రూ,55 లక్షల విలువైన 554 (అరకిలో) గ్రాముల బంగారం, రూ.87 వేల నగదు, ఖమ్మంలో అరెస్ట్ చేసిన ఏ6 నిందితుడు అమర్ బట్ నుంచి రూ. శ్రీ5 వేల నగదు, ఏ5 నిందితుడు జషిముద్దీన్ నుంచి రూ.25 లక్షల విలువైన 25 తులాల బంగారం, రూ.4,84,500 నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ సీఐ వెంకటయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఫ సూర్యాపేట జ్యుయలరీ షాపులో
జరిగిన చోరీ కేసులో
ఇప్పటివరకు నలుగురు అరెస్ట్
ఫ ఏ5 నిందితుడి వద్ద 25తులాల
బంగారం, రూ.4.80లక్షల
నగదు స్వాధీనం