
గణేష్ మండపం వద్ద.. విద్యుదాఘాతంతో బాలుడు మృతి
హాలియా : గణేష్ నవరాత్రి ఉత్సవాల మండపం వద్ద విషాదం చోటుచేసుకుంది. వినాయక మండపం వద్ద భక్తి పాటలు పెట్టేందుకు యాంపిల్ ఫ్లేయర్ వైరును విద్యుత్ బోర్డులో పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై పదకొండేళ్ళ బాలుడు మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని కేవీ కాలనీకి చెందిన దండెం మహేందర్–మౌనిక దంపతుల కుమారుడు మణికంఠ(11) 5వ తరగతి చదువుతున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కేవీ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద భక్తి పాటలు పెట్టేందుకు శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో దండెం మణికంఠ మండపం వద్దకు వెళ్లాడు. యాంపిల్ ఫ్లేయర్ వైర్‌ను విద్యుత్ బోర్డులో పెట్టేందుకు యత్నిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న వయసులోనే నీకు నూరేళ్ళు నిండాయా నాయన అంటూ కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బాలుడి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించారు. ఘటనా స్థలానికి సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ సాయి ప్రశాంత్ చేరుకొని వినాయక మండపాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయిప్రశాంత్ తెలిపారు.
హత్యకేసులో
ఇద్దరికి జీవిత ఖైదు
రామగిరి(నల్లగొండ): మామను హత్య చేసిన కేసులో కోడలికి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ నల్లగొండ మహిళా కోర్టు జడ్జి కవిత శుక్రవారం తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన బొబ్బలి పద్మ అదే గ్రామానికి చెందిన ఆవుల వేణు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం పద్మ భర్త లింగయ్యకు తెలియడంతో మందలించాడు. మరోసారి జరగనివ్వమని పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్నారు. 2017 ఆగస్టు 3న పద్మ మామ భిక్షమయ్య వ్యవసాయ పొలం నుంచి ఇంటి వచ్చే సమయానికి పద్మ తన ప్రియుడు వేణుతో కలిసి ఉంది. దీంతో భిక్షమయ్య ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పద్మ, వేణు ఇద్దరు కలిసి భిక్షమయ్యపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో భిక్షమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పద్మ భర్త లింగయ్య నకిరేకల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి సీఐ సుబ్బరామిరెడ్డి కేసు నమోదు చేసి విచారణ జరిపి ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరమణారెడ్డి వాదనలతో ఏకీభవించిన జడ్జి కవిత ఇద్దరు నిందితులు బొబ్బలి పద్మ, ఆవుల వేణుకు జీవిత ఖైదు, రూ.4 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. కోర్టు కానిస్టేబుల్ సుధాకర్, లైజన్ ఆఫీసర్లు నరేందర్, మల్లిఖార్జునన్ లు కోర్టుకు సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంలో సహకరించారు.