
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
రామన్నపేట: ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన ఠాకూర్ పుష్ప(68) గ్రామంలో ఒంటరిగా ఉంటుంది. ఆమె పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. చిన్న కుమారుడు నెలరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ నెల 26న పెద్ద కుమారుడితో ఫోన్‌లో మాట్లాడి వినాయకచవితికి హైదరాబాద్‌కు వస్తానని చెప్పింది. రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రించింది. బుధవారం ఉదయం పొద్దుపోయే వరకు తలుపు తీయకపోవడంతో గ్రామానికి చెందిన వ్యక్తి పక్కనే మరో తలుపు వద్దకు వెళ్లి తట్టగా తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూడగా పుష్ఫ ముఖంపై రక్తంతో మృతిచెంది ఉంది. దీంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పుష్ప మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబ సభ్యులు ఆమె మెడలో పుస్తెలతాడు, చెవి కమ్మలు లేకపోవడం, ముఖంపై రక్తం ఉండడం చూసి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి, సీఐ ఎన్. వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ డి. నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. క్లూస్‌టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. మృతురాలి కుమారుడు గిరినాథ్‌సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.