
నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య
ఫ కుడి కణతపై కొట్టి చంపినట్లు
గుర్తించిన పోలీసులు
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేష్ (40) 15 సంవత్సరాల క్రితం నల్లగొండకు వలస వచ్చి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేష్ మద్యానికి బానిస కావడంతో అతడి భార్య రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా.. బుధవారం రాత్రి కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు రమేష్ మృతిచెంది ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డితో పాటు ఎస్‌ఐలు సత్యనారాయణ, సైదులు, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుడి కణతపై బలంగా కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చేపల వేటకు వెళ్లి
విద్యార్థి మృతి
కోదాడరూరల్: స్నేహితులతో కలిసి చెరువులో చేపల వేటకు వెళ్లి విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండలం గణపవరం గ్రామంలో బుధవారం జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపవరం గ్రామానికి చెందిన కుక్కడపు నాగేశ్వరరావు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య త్రివేణి, కుమారుడు మనోహర్(11) ఉన్నారు. మనోహర్ కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చవుతున్నాడు. బుధవారం వినాయకచవితి సెలవు దినం కావడంతో మనోహర్ నలుగురు స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు గ్రామంలోని చెరువు వైపు వెళ్లారు. అందరూ చేపలు పడుతుండగా.. మనోహర్ కాలకృత్యాల కోసమని వెళ్లి చెరువు వద్ద పంట కాల్వ కోసం ఏర్పాటు చేసిన గూనలో ప్రమాదశాత్తు జారిపడి మృతి చెందాడు. మనోహర్ కనిపించకపోవడంతో అతడి స్నేహితులు గ్రామానికి చేరుకుని విషయాన్ని చెప్పారు. మనోహర్ తల్లిదండ్రులు, గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకొని జేసీబీ సహాయంతో గూనను తవ్వి మృతదేహాన్ని బటయకు తీశారు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.