
మండపంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
భూదాన్‌పోచంపల్లి: వినాయక మండపానికి టార్పాలిన్ కవర్ కప్పుతుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణ కేంద్రంలోని లక్ష్మణ్‌నగర్ కాలనీలో విజేత యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుండగా.. వినాయక మండపం వేయడానికి అంబేద్కర్ నగర్‌కు చెందిన పోతగల్ల సత్యనారాయణ, గుర్రు కృష్ణ, పెద్దల శ్రీనివాస్ బుధవారం ఉదయం కూలీ పనికి వెళ్లారు. పోతగల్ల సత్యనారాయణ 25 అడుగుల ఎత్తు గల మండపం పైకి ఎక్కి టార్పాలిన్ కవర్ కప్పుతుండగా.. వర్షానికి టార్పాలిన్ కవర్‌పై కాలుపెట్టగానే జారి కిందపడటంతో తల పగలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య శ్రీలత, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.
మృతుడి కుటుంబానికి
న్యాయం చేయాలని ధర్నా
నిరుపేద అయిన పోతగల్ల సత్యనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు గణేశ్ మండపం వద్ద ధర్నా నిర్వహించారు. చివరికి ఇరువర్గాల పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుని.. మృతుడి కుటుంబానికి రూ.4.25లక్షల పరిహారం ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన విరమించారు.