
డిగ్రీ కాలేజీకి జూనియర్ కళాశాల తరలింపు
ఆలేరు: ఆలేరు జూనియర్ కళాశాల భవనం శిథిలమై గదుల పైకప్పుల పెచ్చులూడుతుండటంతో ‘ప్రమాదమని తెలుసు.. ఎందుకో అలుసు’ శీర్షికన ఈనెల 4న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనం ఉన్నతాధికారులను కదిలించింది. అదేరోజు కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. ఈ విషయమై నివేదిక ఇవ్వాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖఅధికారి(డీఐఈఓ) రమణిని ఆదేశించారు. ఈనెల 5న డీఐఈఓ కళాశాలను సందర్శించి కలెక్టర్‌తోపాటు ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకు నివేదిక అందజేశారు. అనంతరం ఇంటర్ బోర్డు కమిషనర్ రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ దేవసేనకు కళాశాల పరిస్థితిని వివరించారు. ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి జూనియర్ కళాశాలను తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన దేవసేన డిగ్రీ కళాశాలకు జూనియర్ కళాశాలను తరలించేందుకు అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జూనియర్ కళాశాలను అధికారులు షిఫ్ట్ చేశారు. సోమవారం నుంచి డిగ్రీ కళాశాలలో జూనియర్ కళాశాల తరగతులు ప్రారంభించారు. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చొరవ చూపిన సాక్షి దినపత్రికకు విద్యార్థులు, అధ్యాపకులు కృజ్ఞతలు తెలిపారు. డిగ్రీ కళాశాలలో మొత్తం ఏడు గదులను తమకు కేటాయించినట్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పూజారి వెంకటేశ్వర్లు చెప్పారు. ఉదయం 8గంటల నుంచి ఒంటి గంట వరకు జూనియర్ కళాశాల తరగతులు, ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు డిగ్రీ కళాశాల తరగతులు సాగుతాయని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజారామ్ తెలిపారు.