
పిల్లలపై ఓ కన్నేయండి!
మానసిక వైద్యులను నియమించాలి
తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
సాక్షి,యాదాద్రి: ఆటాపాటలతో గడపాల్సిన బాల్యం నేరాల ఊబిలో చిక్కుకుంటోంది. చెడుస్నేహం, స్మార్ట్‌ఫోన్‌లు, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ చివరికి హత్యల వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలను వేధిస్తూ షీటీంలకు చిక్కుతున్న వారిలో మైనర్లు కూడా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సహస్ర ఘటనతో పిల్లల నడవడిక తీరు ఆందోళన కలిగిస్తోంది. పిల్లల పెంపకంలో చేసే తప్పులు భవిష్యత్‌లో వారిని దారి తప్పుదారి పట్టించేలా చేస్తాయని, పర్యవేక్షణ ఉంచి రోజూ కొంతైనా సమయం కేటాయిస్తే వారిని సరిదిద్దుకోవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఎందుకు ఇలా మారుతున్నారంటే..
పాఠశాల స్థాయినుంచే సెల్‌ఫోన్, డ్రగ్స్, మద్యం వంటివి విద్యార్థుల జీవితాల్లో చేరుతున్నాయి. వీటికి బానిసలుగా మారిన విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా విద్యారుల జీవితంలో చెడు వ్యవసనాలు భాగం అవుతున్నాయి. అరచేతిలో ఉన్న సెల్‌ఫోన్ వారికిని నేరాల్లోకి నెడుతుంది. తాజాగా హైదరాబాద్‌లో ఓ బాలుడు క్రికెట్ బ్యాట్ చోరీ చేస్తుండగా చూసిందన్న నెపంతో సహస్ర అనే అమ్మాయిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. సెల్‌ఫోన్లలో నేర, హింసాత్మక ఘటనలకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు. పోర్న్, క్రైం, హింస వంటి కంటెంట్ సెల్‌ఫోన్లలో విచ్చలవిడిగా లభ్యమవుతోంది. వాటిని వీక్షించడం వల్ల కలిగే దుష్ఫలితాలే ఈ నేరాలని మానసికవేత్తలు అంటున్నారు.
పాఠశాల దశలోనే చెడు ఆలోచనల వైపు..
విద్యార్థులు పాఠశాల దశలోనే మొబైల్ కంటెంట్, మాదకద్రవ్యాలకు అలవాటుపడి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌లలో లైంగిక, హింసాత్మక అంశాలు కౌమార దశలో ఉన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వారి హార్మోనులను ప్రేరేపించి, మనసును చెడు ఆలోచనల వైపు ప్రేరేపిస్తున్నాయి. ఇవన్నీ చిన్న వయసులోనే నేరస్తులుగా మారుస్తున్నాయి. ఇటువంటి అంశాలను తీవ్రంగా పరిగణించి అరికట్టాల్సిన ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది.
పేద, మధ్య తరగతిలో అధికం..
పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది.ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లో పెరుగుతున్న ఖర్చులు, అదనపు ఆదాయ వనరుల కోసం నిరంతరం తల్లిదండ్రులిద్దరూ శ్రమించాల్సిందే. ఉదయం వెళ్లి సాయంత్రం ఇల్లు చేరే దంపతులు ఒత్తిడితో తమ పిల్లలపై పూర్తిస్థాయి దృష్టి సారించలేకపోతున్నారు. వీటికి తోడు పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, కలహాలు, ఆలుమగల మధ్య మనస్పర్థలు తలెత్తినప్పుడు గొడవలు జరగడం.. వాటి ప్రభావం పిల్లలపై మరింతంగా చూపుతుందని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడి యా పిల్లలను చిన్నతనంలోనే చెడు వ్యసనాలకు దగ్గర చేస్తోంది.
ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్లతో చెడు ఆలోచనలు
దురలవాట్లతోనూ పక్కదారి
కుటుంబాల్లో గొడవలు,
ఆర్థిక ఇబ్బందుల ప్రభావం
చిన్నతనంలోనే పెరిగిపోతున్న నేర ప్రవృత్తి
పాఠశాలల్లో కౌన్సిలింగ్ ఇవ్వాలంటున్న మానసిక నిపుణులు
పిల్లలు చిన్నతనంలోనే పెడదోరణి పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం మండలస్థాయిలో మానసిక వైద్య నిపుణులను నియమించాలి. మానసిక సమస్యలు, ఆత్మస్థైర్యం కోల్పోయినప్పుడు నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది.అలాంటప్పుడు వెంటనే కౌన్సెలింగ్ ఇవ్వాలి.
– పాశం కృష్ణమూర్తి, ఉపాధ్యాయుడు
తమ పిల్లల నవవడికపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. ఒంటిరిగా ఉండడం, తలుపులు మూసుకుని టీవీ, సెల్‌ఫోన్‌లు చూడడం వంటివి గమనించి అడ్డుకోవాలి. పిల్ల ల మందు తల్లిదండ్రులు ఘర్షణలకు దిగడం, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ సమస్యలను ప్రస్తావించొద్దు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులను గమనిస్తుండాలి. చెడుమార్గంలో వెళ్తున్న విద్యార్థులను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలి.
– కలెక్టర్ హనుమంతరావు

పిల్లలపై ఓ కన్నేయండి!

పిల్లలపై ఓ కన్నేయండి!