పరిష్కారం అరకొరే.. | - | Sakshi
Sakshi News home page

పరిష్కారం అరకొరే..

Aug 24 2025 12:10 PM | Updated on Aug 24 2025 12:10 PM

పరిష్కారం అరకొరే..

పరిష్కారం అరకొరే..

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతిలో సమస్యలు అరకొరగానే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు.. పరిష్కారానికి పొంతన లేదు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే గ్రామస్థాయిలో పరిష్కారానికి అనుకూలంగా లేనివే అధికంగా ఉండటంతో వాటి పరిష్కారానికి తహసీల్దార్లు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో అధిక దరఖాస్తులు పరిష్కరించిన జిల్లాల్లో నల్ల గొండ ముందు స్థానంలో ఉండటం గమనార్హం.

పరిష్కారానికి సిద్ధంగా 8,384 దరఖాస్తులు

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల్లో పావలావంతు కూడా పరిష్కారానికి నోచుకోలేదు. రెవెన్యూ సదస్సుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,02,768 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 3,996 దరఖాస్తులను మాత్రమే ఇప్పటి వరకు అధికారులు పరిష్కరించగలిగారు. పరిష్కారానికి సిద్ధంగా మరో 8,384 దరఖాస్తులు ఉన్నాయి. వాటిని తహసీల్దార్లు వారి స్థాయిలో పరిశీలించి.. ఆర్డీఓ, అదనపు కలెక్టర్‌, కలెక్టర్‌ లాగిన్లకు పంపించారు. వారి లాగిన్‌ నుంచి అప్‌లోడ్‌ చేస్తే ఆయా దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయి.

రాష్ట్రంలో నల్లగొండ మొదటి స్థానం

రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. భూ భారతిలో వాటిని పరిష్కరించే క్రమంలో అధికంగా నల్లగొండ జిలాల్లోనే 2,633 దరఖాస్తులు పరిష్కరించారు. తక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం దరఖాస్తులు 61,145 వచ్చాయి. వాటిల్లో పరిష్కారమైంది 99 మాత్రమే. నల్లగొండ జిల్లాలో 43,545 దరఖాస్తులు వస్తే అందులో 2,633 దరఖాస్తులు పరిష్కరించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.

దరఖాస్తులు ఇలా..

జిల్లా దరఖాస్తులు పరిష్కారం

నల్లగొండ 43,545 2,633

సూర్యాపేట 44,741 551

యాదాద్రి 14,482 812

మొత్తం 1,02,768 3,996

భూ భారతి దరఖాస్తులకు కలగని మోక్షం

కుస్తీలు పడుతున్న తహసీల్దార్లు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ

సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు 1,02,768

వాటిలో 3,996 అప్లికేషన్లకే మోక్షం

అయినా నల్లగొండ జిల్లాలోనే ఎక్కువగా పరిష్కారం

ఎన్నో అడ్డంకులు

భూ సమస్యలు పరిష్కరించే విషయంలో క్షేత్రస్థాయిలో తహసీల్దార్లకు తంటాలు తప్పడం లేదు. సాదాబైనామా విషయం కోర్టులో ఉండటంతో ఆ దరఖాస్తులను పక్కన పెట్టారు. ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ (పీఓటీ) పరిధిలో ఉన్న అసైన్డ్‌ భూములకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. మిగిలిన టీఎం 33 భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు పరిష్కరిస్తున్నారు. ఇందులో పౌతిల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా పరిష్కారం కానివి చాలా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం తహిసీల్దార్లు నానా తంటాలు పడాల్సి వస్తోంది. కోర్టు కేసులు, ఇతర భూ సమస్యలకు సంబంధించి మొండి కేసులే అధికంగా ఉండటంతో తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కొందరికి భూమి ఉండి కాగితాలు లేవు. అలాంటి వాటి విషయంలో పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement