
పట్టపగలే ముగ్గురిపై హత్యాయత్నం
చివ్వెంల(సూర్యాపేట): పట్టపగలే భర్త, అతడి ఇద్దరు భార్యలపై కర్రలతో దాడి చేసి హతమార్చేందుకు నలుగురు వ్యక్తులు యత్నించారు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన దండుగల లక్ష్మయ్యకు 2002లో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పారెపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మతో వివాహం జరిగింది. వారికి సంతానం కలగకపోవడంతో వెంకటమ్మ సోదరి పద్మను 2008లో లక్ష్మయ్య రెండో వివాహం చేసుకన్నాడు. రెండో వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మయ్య మొదటి భార్య వెంకటమ్మ గర్భం దాల్చింది. దీంతో ఇద్దరు భార్యలతో కలిసి వడ్డెర పనులు చేసుకుంటూ లక్ష్మయ్య జీవనం కొనసాగిస్తున్నాడు. 2023లో కుడకుడ గ్రామానికి చెందిన శేఖర్‌తో వెంకటమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. శేఖర్ వెంకటమ్మను ఇబ్బందులకు గురిచేయడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. కాగా సూర్యాపేట పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన గోపి ఈ నెల 17న లక్ష్మయ్య వద్ద ఇంటి నిర్మాణానికి రాయి తీసుకెళ్లాడు. రాయికి సంబంధించిన రూ.3 వేలు ఇవ్వాలని లక్ష్మయ్య గోపిని అడగగా ఇవ్వకపోవడంతో శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి గోపిని లక్ష్మయ్య అక్కడకు పిలిచాడు. లక్ష్మయ్య మొదటి భార్య వెంకటమ్మ వివాహేతర సంబంధం పెట్టుకున్న శేఖర్ గోపికి స్నేహితుడు కావడంతో అతడు కూడా వచ్చాడు. అక్కడ డబ్బుల విషయం మాట్లాడుతుండగా.. గోపికి స్నేహితుడైన శేఖర్ లక్ష్మయ్యపై దాడి చేశాడు. అనంతరం లక్ష్మయ్య తన ఇద్దరు భార్యలతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వస్తుండగా.. మార్గమధ్యలో చింతలచెరువు కాలువ వద్ద గోపితో పాటు శేఖర్, రాఘవ, చంటి కారులో మాటువేశారు. చింతలచెరువు కాలువ వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో లక్ష్మయ్య తన బైక్‌లో పెట్రోల్ కొట్టిస్తుండగా.. అక్కడే మాటువేసిన గోపి, అతడి స్నేహితులను లక్ష్మయ్య భార్యలు చూసి అతడికి చెప్పారు. దీంతో లక్ష్మయ్య బైక్‌పై తిరిగి అక్కలదేవిగూడెం వైపు వస్తుండగా కారులో నలుగురు వెంబడించారు. లక్ష్మయ్య, అతడి భార్యలు ప్రాణ భయంతో బీబీగూడెం గ్రామ శివారులో గల మధుర వైన్స్‌లోకి పరిగెత్తారు. అక్కడ ఉన్న వ్యక్తులు వారికి రక్షణ కల్పించడంతో కారులో వచ్చిన వారు పరారయ్యారు. బాధితులు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని లక్ష్మయ్య పోలీసులను వేడుకున్నాడు. ఈ మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫ ప్రాణ రక్షణ కోసం వైన్స్‌లోకి
పరిగెత్తిన బాధితులు