
రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
కట్టంగూర్: రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకొని వ్యవసాయంలో అధిక లాభాలు గడించాలని నాబార్డు తెలంగాణ రీజియన్ చీఫ్ జనరల్ మేనేజర్ బి. ఉదయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(ఎఫ్‌పీఓ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎలక్ట్రికల్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్‌ను, ఆఫ్‌గ్రిడ్ సోలార్ సిస్టమ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం గంగదేవిగూడెంలోని ఎఫ్‌పీఓలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. సోలార్ ప్యానల్‌తో విద్యుత్‌ను స్టోరేజీ చేసి ఆదాయం సంపాదించేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సోలార్ బ్యాటరీ యూనిట్లు ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్‌పీఓలు రైతులకు అన్నిరకాల సౌకర్యాలు అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతున్నాని తెలిపారు. ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించబోయే కృషి వికాస్ స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కార్యక్రమం నిరుద్యోగ యువతకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రాణధార ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని రైతులకు డైరెక్ట్ సీడ్ రైస్(డీఆర్‌ఎస్) పద్ధతిపై సూచనలు, సలహాలు అందించారు. రాబోయే రబీ సీజన్‌లో డీఆర్‌ఎస్ పద్ధతిలో 100 ఎకరాలు సాగు కోసం అవసరమైన మిషన్లు ఉచితంగా అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డు నల్లగొండ డీడీఎం వినయ్‌కుమార్, సూర్యాపేట డీడీఎం రవీందర్‌నాయక్, ఎఫ్‌పీఓ అడ్వైజర్ నంద్యాల నర్సింహారెడ్డి, ఎఫ్‌పీఓ చైర్మన్ చెవుగోని సైదమ్మ, ఐఆర్‌డీఎస్ అధ్యక్షుడు రమేష్, స్వచ్ఛ శక్తి సుధాకర్, శేఖర్ ఉన్నారు.
ఫ నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్
ఉదయ్‌భాస్కర్