
అర్ధరాత్రి చోరీకి యత్నం
చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రలో నివాసముంటున్న డ్రైవర్ నాగయ్య ఇంట్లో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించాడు. రాత్రి ఒంటి గంట సమయంలో నాగయ్య మూత్రవిసర్జనకు వెళ్లేందుకు తలుపు తీయగా.. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. నాగయ్య మనవరాలి చెవికి ఉన్న బంగారంతో పాటు ఇంట్లోని బంగారు ఆభరణాలు, డబ్బులు దొంగిలించేందుకు యత్నించాడు. ఈలోగా నాగయ్య ఇంట్లోకి రావడంతో దొంగ పరారయ్యాడు. అంతకుముందే నాగయ్య ఇంటి సమీపంలోని మరో ఇంట్లో ఆ దొంగ చొరబడి సెల్‌ఫోన్ చోరీ చేశాడు. బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగయ్య ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా దొంగ ఆటోలో పరారైనట్లు గుర్తించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఆలేరురూరల్: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శక్రవారం ఆలేరు మండలం మంతపురి గ్రామంలో చోటుచేసుకుంది. ఆలేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంతపురి గ్రామానికి చెందిన సొప్పోజు కృష్ణచారి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి బీరువాలోని రూ.70వేల నగదు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటికి తిరిగొచ్చిన కృష్ణచారి, కుటుంబ సభ్యులు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాలాద్రి తెలిపారు.
మోటారు కేబుల్ వైర్లు..
తిప్పర్తి: తిప్పర్తి మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామ సమీపంలో రైతుల పొలాల వద్ద బోరు మోటార్ల కేబుల్ వైర్లను గుర్తుతెలియని అపహరించారు. సుమారు 30మంది రైతులకు సంబంధించిన కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు శుక్రవారం తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.