
మునగాలలో క్లినిక్ సీజ్
మునగాల: మండల కేంద్రంలోని ఆర్‌ఎంపీ చంద్రమౌళి నిర్వహిస్తున్న క్లినిక్‌ను శుక్రవారం జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ సీజ్ చేశారు. ఆర్‌ఎంపీ చంద్రమౌళి చేసిన వైద్యం వికటించడంతోనే ఈనెల 5న మునగాల మండలంలోని బరాఖత్‌గూడెం గ్రామానికి చెందిన గోవింద వెంకటేశ్వర్లు మృతి చెందాడని బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునగాల పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయమనోహరి క్లినిక్‌తో పాటు అనుబంధంగా ఉన్న అమ్మ రక్తపరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పరిమితికి మించి వైద్యం చేయొద్దని, అనవసరంగా యాంటిబయాటిక్ మందులు వినియోగించొద్దని హెచ్చరించారు. అయినా చంద్రమౌళి క్లినిక్‌లో యథావిధిగా వైద్యం చేస్తున్నాడని సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తన సిబ్బందితో కలిసి క్లినిక్‌ను సీజ్ చేయడంతో పాటు అమ్మ రక్తపరీక్ష కేంద్రం నిర్వాహకుడికి నోటీసు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారి వెంట సూర్యాపేట డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్, కోదాడ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయమనోహరి, స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రవీందర్, వైద్య సిబ్బంది ఉన్నారు.