
గర్భిణి మృతి కేసులో ఏడుగురి అరెస్ట్
సూర్యాపేట టౌన్: గర్భిణికి ఆమె భర్త ఆర్‌ఎంపీ వైద్యులతో అబార్షన్ చేయించగా.. అది వికటించి ఆమె మృతిచెందింది. దీంతో ఆమె భర్తతో పాటు అబార్షన్ చేసేందుకు సహకరించిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను బుధవారం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామానికి చెందిన బయగల శ్రీను, విజిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడోసారి గర్భవతి అయిన విజిత(ఐదు నెలలు)కు ఈ నెల 15న అకస్మాత్తుగా కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయిబాలాజీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పి వైద్యం చేయగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఖమ్మంకు తీసుకెళ్లారు. అప్పటికే విజిత పరిస్థితి విషమించి మృతి చెందింది. తన భార్య మృతికి ఆర్‌ఎంపీ బండి శ్రీనివాస్ కారణమని తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌లో శ్రీను ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆర్‌ఎంపీని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.
అబార్షన్ చేయించడంతో..
విజితకు ఆమె భర్త శ్రీను ఖమ్మం పట్టణంలో స్కానింగ్ చేయించగా.. కడుపులో మళ్లీ ఆడపిల్లే ఉందని తేలడంతో అబార్షన్ చేయించాలని అనుకున్నాడని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఆర్‌ఎంపీ బండి శ్రీనివాస్‌ను సంప్రదించగా.. అతడు మరో ఆర్‌ఎంపీ పానుగంటి సతీష్‌తో కలిసి విజితకు ఈ నెల 15న తుంగతుర్తి మండల కేంద్రంలోని సాయిబాలాజీ హాస్పిటల్‌లో అబార్షన్ చేశాడని డీఎస్పీ తెలిపారు. ఈ అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. అయితే శ్రీను తన భార్య విజితను ఖమ్మం తీసుకెళ్లి అక్కడ తుమ్మచర్ల అరుణ అనే నర్సును సంప్రదించి లింగ నిర్ధారణ పరీక్ష చేయించాడని, ఖమ్మం పట్టణంలో కల్పన క్లినిక్ నిర్వహిస్తున్న పోలంపల్లి కల్పన లింగ నిర్ధారణ పరీక్ష చేసినట్లు తమ విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఖమ్మం పట్టణానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ సంపేట అశోక్ స్కానింగ్ పరికరంతో లింగ నిర్ధారణ పరీక్ష చేశాడని, అతడికి లింగ నిర్ధారణ పరీక్ష చేసే స్కానర్‌ను పులి వీరభద్రరావు సమకూర్చినట్లు గుర్తించామని డీఎస్పీ వివరించారు.
ఏడుగురి అరెస్ట్, రిమాండ్..
ఈ కేసులో ఏ–1 తుంగతుర్తికి చెందిన ఆర్‌ఎంపీ బండి శ్రీనివాస్, ఏ–2 విజిత భర్త బోయగల శ్రీను, ఏ–3 ఖమ్మంలో స్కానింగ్ చేసే సంపెట అశోక్, ఏ–4 స్కానింగ్ చేసే పరికరం సమకూర్చిన పులి వీరభద్రరావు, ఏ–5 లింగ నిర్ధారణ పరీక్ష చేయడానికి ఏర్పాటు చేసిన నర్సు తుమ్మచర్ల అరుణ, ఏ–6 కల్పన క్లినిక్ నిర్వాహకురాలు పోలంపల్లి కల్పన, ఏ–7 నాగారం మండలం పసునూరు గ్రామానికి చెందిర ఆర్‌ఎంపీ పానుగంటి సతీష్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
అబార్షన్ వికటించి మృతిచెందినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ
ఆమె భర్తతో పాటు ఆరుగురి రిమాండ్