
ప్రజా పోరాటాలకు పాటే ప్రాణం
రామన్నపేట: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి ప్రజా పోరాటాల వరకు పాటే ప్రాణంగా నిలిచిందని, భూమి ఉన్నంత వరకు పాటకు మరణం ఉండదని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో బుధవారం రామన్నపేటలో నిర్వహించిన జానపద కళాకారుల ప్రదర్శనను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాటకు, ఆటకు ప్రజలను చైతన్యపరిచే గొప్ప శక్తి ఉందని తెలిపారు. పాశ్చాత్య విష సంస్కృతి వల్ల అంతరించిపోతున్న జానపద కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. వందలాది మంది కళాకారులను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి ప్రదర్శనలు ఇవ్వడం శుభపరిణామమని కొనియాడారు. ప్రజా నాట్యమండలి ప్రజాపాటకు బహువచనమని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ప్రపంచీకరణ ముసుగులో ప్రజాకళలు పెట్టుబడిదారుల చేతుల్లో బందీ అవుతున్నాయని, సినిమాలు ఇతర రూపాల్లో వికృతరూపం దా లుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజానాట్య మండలి ప్రజల కళారూపాలను భుజానికి ఎత్తుకొని ముందుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చిందు, యక్షగానం, భాగవతం, కోలాటం, బుర్రకథ, డప్పు కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా కోఆర్డినేటర్ వేముల పుష్ప, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, పీఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటెపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, దేశపాక రవి, కూరెళ్ల నర్సింహాచారి, వేల్పుల వెంకన్న, మేడి పృథ్వీ, గంటెపాక శ్రీకృష్ణ, కందుల హన్మంత్, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం పాల్గొన్నారు.
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ