
పది రోజుల్లో ఇంటింటికి తాగునీరు అందించాలి
పెద్దవూర: పది రోజుల్లో ఇంటింటికి తాగునీటిని అందించాలని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ నీరు రావడం లేదన్న ఫిర్యాదుతో బుధవారం ఆయన ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డితో కలిసి పెద్దవూర మండల కేంద్రంతో పాటు గర్నెకుంట, వెల్మగూడెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా ఎలా ఉందని ఇళ్లలోకి వెళ్లి మహిళలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని మహిళలు ఆయనకు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించగా.. రోజుకు 400 లీటర్ల నీటిని వాడుకోవాల్సి ఉండగా 1200 లీటర్ల నీటిని వాడుకుంటున్నారని తెలిపారు. ఫ్లో కంట్రోల్ సిస్టం ఏర్పాటు చేస్తే ఎక్కువ తక్కువలు కాకుండా ఇంటింటికి ఒకే పరిమాణంలో తాగునీటిని అందించవచ్చునని అధికారులు పేర్కొన్నారు. చౌరస్తాలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న నల్లాను తొలగిస్తే ఇంటింటికి నీళ్లు అందుతాయని తెలుపగా.. వెంటనే తొలగించాలని సూచించారు. మిషన్ భగీరథ పథకానికి సంబంధించి మండలంలో గర్నెకుంట చివరి గ్రామం అని కరెంట్ పోయినా, పైపులు పగిలినా మొదటగా సమస్య ఇక్కడే ఉత్పన్నమవుతుందని భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. వెల్మగూడెంలో గతంలో నిర్మించిన పాత సంపులోకి నీటిని ఎక్కిస్తే గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, పబ్బు యాదగిరి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు నాగేశ్వర్‌రావు, కృష్ణయ్య, ఈఈలు శాంతికుమారి, లక్ష్మీనారాయణ, డీఈలు మధు, నిరంజన్‌సిన్హా, ఏఈలు దీక్షిత్, ప్రవీణ్, నడ్డి గోపాలకృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి జానారెడ్డి