
ప్రీ ప్రైమరీ స్కూళ్లలో అడ్మిషన్లు
భువనగిరి : జిల్లాకు మంజూరైన 36 ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించినట్లు డీఈఓ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు సంవత్సాలు నిండిన చిన్నారులు అర్హులన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రీ ప్రైమరి స్కూళ్లలో చేర్పించేందుకు నేరుగా సంబంధిత ప్రధానోపాధ్యాయులను, లేదా 9948979973 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఎంపికై న పాఠశాలలు ఇవీ..
అడ్డగూడూరు మండలంలో కంచనపల్లి, లక్ష్మీదేవికాల్వ, జానకీపురం, అడ్డగూడూరు, ఆలేరు మండలంలో పటేల్‌గూడెం, మంతపురి, తూర్పుగూడెం, ఆత్మకూర్(ఎం) మండలంలో తుక్కాపూర్, భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడం, సూరేపల్లి, కూనూరు, ముస్త్యాలపల్లి, బొమ్మలరామారం మండలంలో ప్యారారం,సోలిపేట,పెద్దపర్వతాపూర్, నాగినేనిపల్లి, చౌటుప్పల్ మండలంలో పెద్దకొండూరు, గుండాల మండలంలో బ్రాహ్మణపల్లి, తుర్కపల్లి మండలంలో నాగాయపల్లితండా, మాదా పురం, పెద్దతండా, దిలావర్‌పూర్ ఉన్నాయి. వీటితో పాటు భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు, జలాల్‌పూర్, రాజాపేట మండలంలోని పారుపల్లి, బూరుగుపల్లి,రామన్నపేట మండలంలో ఎన్నారం, మునిపంపుల, శోభనాద్రిపురం, వలిగొండ మండలం లింగరాజుపల్లి, వలిగొండ, ఏదుల్లాగూడెం, యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు, కొత్తగుండ్లపల్లి, ధర్మారెడ్డిగూడెం గ్రామాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి.
ఆకట్టుకున్న
టీఎల్‌ఎం మేళా
యాదగిరిగుట్ట: పట్టణంలోని పాత గోశాల ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కల్యాణవేదికలో బుధవారం ఏర్పాటు చేసిన బోధన అభ్యసన సామగ్రి (టీఎల్‌ఎం) మేళా అకట్టుకుంది. వివిధ పాఠశాలలు తయారు చేసిన బోధన అభ్యసన సమాగ్రిని మేళాలో ప్రదర్శించారు. వాటిని మండల విధ్యాధికారి శరత్ యామినితో కలిసి డీఈఓ సత్యనారాయణ పరిశీలించారు. విద్యార్థులకు సులువైన పద్ధతుల్లో బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. 10 ఉత్తమ ఎగ్జిబిట్‌లను జిల్లాస్థాయికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఆర్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.
త్వరలో కోర్టు భవనం పనులు ప్రారంభం
భువనగిరిటౌన్ : జిల్లా కోర్టు భవనాల పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు తెలిపారు. భువనగిరి పట్టణ శివారులో కోర్టు నూతన భవనిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని బుధవారం పరిశీలించారు. స్థలాన్ని చదునుచేయడం తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులకు సూచించారు. రూ.81 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఆయన వెంట జిల్లా న్యాయసేవా అధికారి సంస్థ కార్యదర్శి మాధవి లత, భువనగిరి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వాళ్లందాస్ వెంకటయ్య ఉన్నారు.
నేత్రపర్వంగా
గజవాహన సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం నిత్యారాధనలో భాగంగా గజవాహన సేవ నేత్రపర్వంగా చేపట్టారు. స్వామి, అమ్మవారి నిత్యకల్యాణ తంతు సందర్భంగా తొలుత గజవాహన సేవను ఊరేగించడం సంప్రదాయం. అంతకుముందు వేకువజామున స్వామివారి మేల్కొలుపులో సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన చేశారు. ఇక ఉత్తర దిశలోని మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, ముఖ మండపంలో సువర్ణపుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవారికి శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వారబంధనం చేశారు.

ప్రీ ప్రైమరీ స్కూళ్లలో అడ్మిషన్లు